రోమ్‌లో 18వ డబ్ల్యుఎఫ్‌టీయూ మహాసభలు
ఏథెన్స్ : ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టీయూ) 18వ మహాసభలు మే 6-8 తేదీలలో ఇటలీలోని రోమ్‌లో జరుగనున్నాయి. సామ్రాజ్యవాద-పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని డబ్ల్యుఎఫ్‌టీయూ తాజా ప్రకటన పేర్కొంది. ఈ 18వ మహాసభలో తమ దేశాలు, ప్రాంతాలలోని శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ సవాళ్లను చర్చించడానికి ట్రేడ్ యూనియన్ నాయకులకు, కార్యకర్తలకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రజాస్వామ్య చర్చలు, అవలంబించే నిర్ణయాలు, కార్మికుల పోరాటాలకు, ట్రేడ్ యూనియన్ అభివృద్ధికి ఈ మహాసభలు కొత్త ఊపునిస్తాయని పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా అమలవుతున్న పరిమితుల దృష్ట్యా ఈ సమావేశం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ప్రపంచ కార్మికవర్గ పోరాటాలు, లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగా చారిత్రాత్మక 18వ ప్రపంచ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌ను ఐక్యంగా విజయవంతం చేయాల్సిన అవసరం వుందని పేర్కొంది. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అనే నినాదంతో ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టీయూ) ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తున్నది.