వీధి విక్రయదారులకు ఆర్థిక సహాయం చేయాలి
పారిశుద్ధ్య కార్మికులకు ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలి
సీపీఐ నగర కార్యదర్శి జీ.కోటేశ్వరరావు
న్యూస్ తెలుగు/విజయవాడ : వీధి విక్రయదారులకు ఆర్థిక సహాయం చేయటంతో పాటు బుడమేరు ముంపులో విశేష సేవలు అందించిన పారిశుధ్య కార్మికులకు ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలని సీపీఐ నగర కార్యదర్శి జీ.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వీధి విక్రయదారులకు ఆర్థిక సహాయం, బుడమేరు పారిశుధ్య కార్మికులకు ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలని కోరుతూ నగర ఏఐటీయూసీ నాయకులతో కలిసి కోటేశ్వరరావు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రకు సోమవారం మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వచ్చిన బుడమేరు ముంపు వల్ల నగరంలోని 32 డివిజన్లు జలదిగ్బంధమయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన వీధివిక్రయదారులను ఆర్థికంగా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించినట్లు గుర్తు చేశారు. గతంలో హుదూత్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో నష్టపోయిన తోపుడుబండ్లుపై వ్యాపారాలు చేసుకునే జీవించే చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఇటీవల విజయవాడ నగరంలో బుడమేరు ముంపు వల్ల నష్టపోయిన చిరు వ్యాపారులు తమ తోపుడు బళ్ళు కోల్పోయారని, పళ్ళు, పువ్వులు, కూరగాయలు, పచ్చి సరుకు, ఇతర వస్తువులతో పాటు సర్వం కోల్పోవటం జగమెరిగిన సత్యమన్నారు. కాని వారిని నేటి వరకు ఏ ఒక్కరూ ఆదుకోలేదని, ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ ద్వారా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అదే మాదిరిగా బుడిమేరు ముంపులో ప్రజలు అంటు రోగాలు బారిన పడకుండా రేయింబవళ్లు విశేష సేవలందించిన పారిశుధ్య కార్మికులకు ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలని కమిషనర్ కోరారు. వరద ముంపుకు గురైన 32 డివిజన్లలో నేటికీ పారిశుధ్య కార్మికులు తమ సేవలను అందిస్తూనే ఉన్నారని, వారి సేవలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించి నగరాన్ని ఆరోగ్యంగా ఉంచాలని సూచించారు. రెక్కాడితే కాని డొక్కాడని వీధి విక్రయ దారులు, నగరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించి ఆదుకోవటం మానవతా ధర్మమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష , కార్యదర్శులు కేఆర్.ఆంజనేయులు, మూలి సాంబశివరావు ,వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు, నాయకులు సీహెచ్‌ఎల్వీపీ మారుతీరావు, ఎక్కిలి కృష్ణ, కుమార్, భీమారావు, మల్లేశ్వరి, దివ్య, ఏఐవైఎఫ్ నగర నాయకులు లంకె సాయి తదితరులు పాల్గొన్నారు.(Story : వీధి విక్రయదారులకు ఆర్థిక సహాయం చేయాలి)