అలెర్ట్: బెజవాడలో మళ్లీ పెరిగిన వరద!
న్యూస్ తెలుగు/విజయవాడ: వారం రోజులుగా విజయవాడను అల్లాడిస్తున్న వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. దీంతో ప్రజలు మరోసారి భయకంపితులవుతున్నారు. ఈ వరదకు కారణమైన బుడమేరు గండ్లు పూడ్చడానికి ఓవైపు పనులు విస్తృతం చేస్తుండగా, మరోవైపు పైనుంచి వచ్చిన నీటి ఫ్లో కారణంగా వరద పెరిగింది. బుడమేరుకు ఇంకో గండి పడింది. అయితే వెంటనే అధికారులు, సిబ్బంది స్పందించి దాన్ని పూడ్చేశారు. శుక్రవారం ఉదయానికి, సాయంత్రానికి పోల్చిచూస్తే, అజిత్‌సింగ్‌నగర్, వాంబే కాలనీ, సుందరయ్యనగర్, పాతపాడు, కండ్రిక ప్రాంతాల్లో వరద నీటి మట్టం పెరిగింది. మరోవైపు, ప్రభుత్వ సహాయక చర్యలు విస్తృతంగా సాగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడయంను స్టాక్‌పాయింట్‌గా చేసుకొని, అక్కడి నుంచి ఆహారపానీయాలను ప్యాకెట్ల రూపంలో వాహనాల ద్వారా వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందితోపాటు దాదాపు అన్ని శాఖలు వరద సహాయక చర్యల్లోనే మునిగి తేలుతున్నాయి. ఇదిలాఉండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి వరద పీడిత ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. బుడమేరు గండ్లు పడిన ప్రాంతాలను సమీక్షించారు. పనులను పరిశీలించి, అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు కాల్వ దిశను క్షుణ్నంగా పరిశీలించారు. కొల్లేరు వరకు ఆయన తన సమీక్షను కొనసాగించారు. ఇంకోవైపు, ప్రకాశం బ్యారేజీ వద్ద అవుట్‌ఫ్లో, ఇన్‌ఫ్లోను కూడా పరిశీలించారు. కాగా, వరదల కారణంగా ఇప్పటివరకు 43 మంది మరణించినట్లుగా చెపుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 300 వరకు పశువులు మృతు చెందాయి. 3756 కిలోమీటర్ల పొడవునా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటన్నింటికీ మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఐదున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు. వరద బాధితుల కోసం ఇప్పటివరకు 214 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిని 250కి పెంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి శిబిరాల్లో 46 వేల మంది బాధితులు ఉన్నారు. ప్రభుత్వ శాఖల పరిధిలో వెయ్యి కోట్ల రూపాయల పైనే నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్‌టీఆర్ జిల్లాతోపాటు తూర్పు గోదావరి, రాయలసీమ, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి కూడా అధికారులు ఇక్కడి బాధితుల కోసం ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు పంపిస్తున్నారు. (Story: అలెర్ట్: బెజవాడలో మళ్లీ పెరిగిన వరద!)