నర్సింగాయపల్లి లో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో నిలువ నీరు లేకుండా చర్యలు తీసుకోండి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన కలక్టర్ ఆదర్శ్ సురభి
రూ. 23.75 కోట్ల నిధులతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ ను డిసెంబర్ మాసం చివరి లోగా పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఉదయం నర్సింగాయపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలక్టర్ సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆసుపత్రి ప్రాంగణాల్లో వర్షపు నీరు ఉండిపోవడం రోగులు ఇబ్బందులు గురికావడాన్ని దృష్టిలో ఉంచుకుని కలక్టర్ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్, టి.ఎస్.యం.ఐ.డి.సి అధికారులతో కలిసి పరిశీలించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ని మూసివేసి షాపులు నిర్మించుకోవడాన్ని పరిశీలించిన కలక్టర్ సరైన అనుమతులు లేకుండా నిర్మించిన షాపులను వెంటనే తోలగించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. భవిష్యత్తులో ఆసుపత్రి పరిసరాల్లో నీరు చేరడం వంటి ఫిర్యాదులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిసరాల్లో జె.సి.బి. తో శుభ్రం చేయించాలని సూచించారు. సెప్టెంబర్ 9వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్, ఒ.పి. రూమ్, హై మాస్క్ లైట్ ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేయాలని టి.జి.యం.ఐ.డి.సి. కార్యనిర్వహక ఇంజనీరు జైపాల్ రెడ్డిని ఆదేశించారు. అక్కడే నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక కాలపరిమితి ఏర్పాటు చేసుకొని ప్రతి రోజూ పూర్తి చేయాల్సిన పనిని నిర్దేశించుకోవాలని సూచించారు. అనంతరం టి. డయజ్ఞాస్టిక్ హబ్ ను సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఒక చోట సి.టి స్కాన్ మరో చోట ఉండటం సరికాదని దీనిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చేందుకు ప్రణాళికలు చేయాలని ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో లేబర్ రూమ్, పిల్లల వార్డు సందర్శించి వైద్యులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టి.జి.యం.ఐ.డి.సి. కార్యనిర్వహక ఇంజనీరు జైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, టౌన్ ప్లానింగ్ అధికారి కరుణాకర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు, వైద్యులు తదితరులు ఉన్నారు. (Story : నర్సింగాయపల్లి లో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి)