ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
శిధిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీచేయాలి
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109
ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెo. 6309842395.
08717-293246
ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వండి
అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు
ప్రజలు అధికారులకు సహకరించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
న్యూస్ తెలుగు /ములుగు :
జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తునందున ప్రయాణాలు చేయవద్దని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు జిల్లాలో లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తూ, శిధిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి, సమీప బంధువు ల దగ్గరికి, పునరావాస కేంద్రాల్లోకి, పంపడం జరుగుతుందని, వాతావరణ శాఖ సూచనల ప్రకారం రానున్న 3 రోజులు అతి భారీవర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లను ప్రజలు స్వచ్చందంగా
ఖాళీ చేయాలని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు పనిచేయు విధంగా ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెo. 6309842395. 08717-293246 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109 ను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ సిబ్బంది అత్యవసర సేవల్లో ఉన్నందున ఎలాంటి సెలవులు అనుమతించ బడవని తెలిపారు. ప్రజలు విపత్కర పరిస్థిత్తుల్లో ఉన్నారని యంత్రాంగం అన్ని
తానై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల జిల్లాలోని అన్ని చెరువులు, వాగులు
ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయని, చెరువులు, వాగులు చూసేందుకు ప్రజలు వెళ్ళొద్దని సూచించారు. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చిన్నా, పెద్ద చెరువులు, వాగులు నిండుకుని ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు, వంకలు చూసేందుకు, సెల్ఫీలు, ఫోటోల కోసం ప్రజలు వస్తుంటారని, నీటి ప్రవాహం వల్ల ప్రమాదం పొంచి ఉందని, పడిపోయే అవకాశాలున్నాయని ఎవరూ వెళ్ళొద్దని ఆయన అన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని అన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు. అలాగే పశువులను మేతకు బయటికి వదలొద్దని ఆయన తెలిపారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముందస్తు ప్రణాళికలతో చేపట్టిన చర్యలల్లో ప్రభుత్వ యంత్రాంగపు విధులను కలెక్టర్ అభినందించారు. పూర్తిగా వర్షాలు వరదలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఇదే పనితీరును కనబరిచాలని అన్నారు. విపత్కర పరిస్థితిల్లో ప్రజలు యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని కలెక్టర్ సూచించారు.
భారీ వరదలు వచ్చే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని నీటి వనరులు అందులోని నీటి నిల్వ పరిస్థితి, చెరువు కట్టలు మొదలవు వాటిని అధికారులు పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోందని, ఈ వరద వల్ల ప్రభావితమయ్యే గ్రామాలు, రహదారుల గురించి, సమాచారం ప్రజలకు చేరవేయాలి. ఆ ప్రాంతంలో రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలి. ముంపు ప్రాంతాల ప్రజలు ఎగువ సురక్షిత ప్రదేశానికి తరలించాలి.
జిల్లా వైద్యాధికారి, సిబ్బంది,
ఇతర ప్రోగ్రామ్ వైద్యులు గ్రామాలను సందర్శించి గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్యకలాపాలను పరిశీలించి, గర్భిణీలను గుర్తించి వైద్య సేవలకు ఆసుపత్రులకు తరలించాలి. జ్వరాలు మరియు డెంగ్యూ కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాలి.
వర్షాలు మరియు పారిశుధ్యం, ఆరోగ్య సమస్యల పరంగా రానున్న 3 రోజులు మరింత క్లిష్టమైనవి. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ముంపు సమస్యలపై
శ్రద్ధ వహించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులను తన దృష్టికి తేవాలని ఆదేశించారు.