32 వార్డుల్లో 64 వైద్య శిబిరాలు ఏర్పాటు
బాధితులెవరికీ మందుల కొరత రాకూడదు
మందుల పంపిణీని పరిశీలించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్
న్యూస్‌తెలుగు/విజయవాడ: విజయవాడ నగరంలో వివిధ కాలనీల్లో నీటిమట్టం తగ్గు ముఖం పడుతున్న దృష్ట్యా సంక్రమిత వ్యాధులు (communicable diseases ) ప్రబలే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో మందుల్ని, వైద్య సేవల్ని
అందుబాటులోకి తెచ్చామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్(commissi-oner, Health and Family welfare C.Harikiran IAS) తెలిపారు. విజయవాడ నగరంలో అత్యవసర మందుల కిట్ల సరఫరా, అలాగే 104 సంచార వైద్య శాలల్లో మందుల పంపిణీని బుధవారం ఆయన పరిశీలించారు. సితారా సెంటర్, భవానీపురం స్వాతి థియేటర్ ప్రాంతాల్లో పర్యటించిన కమీషనర్ మందుల పంపిణీని స్వయంగా పరిశీలించారు. ఏయే మందులు ఎవరెవరికి అందజేస్తున్నదీ, ముఖ్యంగా అత్యవసరంగా ఏయే మందులు ఇస్తున్నదీ డాక్టర్లను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధితుల్లో ఎక్కడా ఎవరికీ మందుల కొరత రాకూడదని కమీషనర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 32 వార్డుల్లో 64 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, ఈ వైద్య శిబిరాలలో రోగులకు అవసరమయ్యే వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల్ని అందిస్తారన్నారు. 32 వార్డులతో పాటు అధికంగా నష్టానికి గురైన సమీపంలోని 5 గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేస్తూ, అనుబంధంగా సంచార వైద్య శిబిరాల్ని కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఈ శిబిరాలలో 200 రకముల మందులను సిద్ధంగా ఉంచామన్నారు. వైద్య సేవలు అందించడంలో తగిన సూచనలు, సలహాల కోసం ఉన్నత అధికారులతో 10 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర ఆరోగ్య సేవల్ని అందించేందుకు అనేక కార్యక్రమాల్ని వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిందన్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న 32 వార్డుల్లో అందరికీ 6 రకాల అత్యవసర మందుల కిట్లను, వాడే విధానాన్ని వివరించే కరపత్రాల్ని అందజేశామన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు గారి ఆదేశాల మేరకు సుమారు 75 వేల అత్యవసర మందుల కిట్లను హెలికాప్టర్ ద్వారా, బోట్ల ద్వారా మరియు రోడ్డు మార్గంలో అందించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామన్నారు. (Story : 32 వార్డుల్లో 64 వైద్య శిబిరాలు ఏర్పాటు)