పైడితల్లమ్మకు పుష్పాలంకరణ
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ వారికి శ్రావణమాసం మూడవ మంగళవారం సందర్భంగా పట్టణంలో ఉన్న చదురు, వనం దేవాలయాల వద్ద విశేష పుష్పాలంకరణ చేశారు. చదురు గుడి వద్ద ఆలయ అసిస్టెంట్ కమిషనర్ డి వి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. శ్రావణమాసం మూడవ మంగళవారం కావడంతో సుదూర ప్రాంతాల నుండి దేవాలయాల వద్దకు ఉదయం నుండే భక్తులు విచ్చేసి తమ ముడుపులు, మొక్కుబడులను అమ్మవారికి సమర్పించారు. దేవాలయాల వద్దకు విచ్చేసిన భక్తులకు ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు, అర్చకులు ఏడిద వెంకటరమణ పూజలు నిర్వహించారు. మంచినీటి సౌకర్యం, ప్రసాద వితరణ, ఉచిత వైద్య శిబిరాల తో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఆలయ అధికారులు నిర్వహించారు. దేవాలయం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సీనియర్ అసిస్టెంట్లు ఏడుకొండలు, మణికంఠ, అధికారులు చర్యలు చేపట్టారు (Story : పైడితల్లమ్మకు పుష్పాలంకరణ)