అవధూత దత్త సాయి సమర్థ పీఠంలో గురు పౌర్ణమి వేడుకలు
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్: పట్టణంలో ధర్మపురి రోడ్డు వద్ద ఉన్న అవధూత దత్త సాయి సమర్థ పీఠంలో సాయి సుందర మహారాజ్ ఆధ్వర్యంలో దేవాలయంలో ఉన్న షిరిడి సాయిబాబా మూల విరాట్ విగ్రహానికి భక్తులతో పాలాభిషేకం నిర్వహించి విశేషాలంకరణ చేశారు. ఈ సందర్భంగా సాయి సుందర మహారాజ్ మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి వాళ్ళ ఆశీర్వచనం పొందడం మంచిదన్నారు. ఉత్తరాంధ్రకు మొట్టమొదటి షిరిడి సాయిబాబా దేవాలయంగా పేరు పొందిన అవధూత దత్త సాయి సమర్థపీఠంలో ప్రతి ఏటా గురు పౌర్ణమి తో పాటు దసరా, శ్రీరామనవమి పర్వదినాల్లో కూడా భక్తులతో మూలవిరాట్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా ప్రతి గురువారం ఉదయం 5.30 నుండి 9:30 వరకు ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటితో పాటుగా ప్రతి ఆదివారం దేవాలయంలో ఉన్న సిద్ధిరాజ దత్తాత్రేయ స్వామికి భక్తులచే తైలాభిషేకం నిర్వహించబడుతుందన్నారు. అనంతరం దేవాలయం వద్దకు విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. (Story : అవధూత దత్త సాయి సమర్థ పీఠంలో గురు పౌర్ణమి వేడుకలు)