ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులే స్వయంగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. వాటిలో పన్నులు, అనధికార ఆక్రమణలు, సీసీ రోడ్ నిర్మాణం, త్రాగునీటి సరఫరా, దోబీ ఖానా వద్ద బడ్డిని తొలగింపు, కమ్యూనిటీ హాల్ తదితర అంశాలపై ఫిర్యాదులను కమిషనర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల పరిదిలోని సచివాలయ సిబ్బందిని పర్యవేక్షిస్తూ ప్రతి సచివాలయం పరిధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎప్పుడు వచ్చిన సమస్యలు అప్పుడే ఎక్కడిక్కడ పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, సీపీ ప్రసాద్, సీఈ శ్రీనాథ్‌రెడ్డి, రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ సృజన, ఇంచార్జ్ సీఎంవోహెచ్ డా.సురేష్‌బాబు, ఎస్‌ఈలు సత్యనారాయణ, సత్యకుమారి, జిల్లా ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. (Story : ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి)