బొల్లాపల్లిలో బండ్లమోటు సీసపు గని ని తిరిగి ప్రారంభించాలి
అఖిలపక్ష రాజకీయ పార్టీల డిమాండ్
తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన జీవి ఆంజనేయులు
మాజీ శాసన సభ్యులు మక్కెన మల్లికార్జునరావు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బండ్ల మోటు వద్ద మూసి వేయబడివున్న హిందుస్థాన్ జింక్ సీసపు గని కర్మాగారాన్ని తిరిగి పునః ప్రారంభించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు సోమవారం సిపిఐ వినుకొండ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో మారుతి మాట్లాడుతూ వేలాదిమంది నిరుద్యోగులకు తిరిగి ఉద్యోగ వసతులు కల్పించ గలిగినటువంటి బండ్లమోటు జింక్ సీసపు కర్మాగారాన్ని తిరిగి పునః ప్రారంభించాలని వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు పూర్తిస్థాయిలో సహకరించి కేంద్ర పెద్దలతో మాట్లాడి కర్మాగారం ప్రారంభించగలరని ఆయనను కోరారు.అనంతరం అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జీ.వీ. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావులు మాట్లాడుతూ నియోజకవర్గంలో వేలాదిమందికి ఉద్యోగ వసతులు కల్పించే సీసపు గని తిరిగి ప్రారంభించ వలసిన ఆవశ్యకత ఉన్నదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి తో మాట్లాడి ఎంపీలను కలుపుకొని కేంద్ర మంత్రులతో మాట్లాడి తప్పకుండా గని పునః ప్రారంభించడానికి తన వంతు కృషి చేస్తానని అఖిలపక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. అలాగే బండ్లమోటు గనిలో పనిచేసిన పూర్వపు ఏఐటీయూసీ నాయకులు కామ్రేడ్ యం.హెచ్. ప్రసాద్, జయ రావు తదితరులు మాట్లాడుతూ బండ్లమోటు సీసపు గని మూసివేయబడిన నాటికే అప్పటికే 15 లక్షల టన్నుల సీసాన్ని ఉత్పత్తి చేసి ఉన్నదని గతంలో సీసం టన్ను 50వేల రూపాయలు ఉండగా ప్రస్తుతం దాని ధర టన్ను ఒక లక్ష 50 వేలకు పెరిగిందని దీనివల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయంతో పాటు అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగ వసతులు కలుగుతాయన్నారు. 2000 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణ విధానాల ఫలితంగా సీసపు గనిలో నష్టాలను చూపించి మూసివేయడం జరిగిందని ఆయన అన్నారు. గని మూసివేసిన సమయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని అనేక పోరాటాలు ఉద్యమాలు చేశామన్నారు. బండ్లమోటు జింక్ కర్మగారం పరిస్థితులన్నీ పూర్తి అవగాహనతో మాకు తెలుసునని దానిని పునః ప్రారంభిస్తే ఖచ్చితంగా లాభాల బాటలో నడుస్తుందని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి గని ని ప్రారంభించి మండలంలోని నిరుద్యోగులకు ఉద్యోగ వసతులు కల్పించవలసినదిగా వారు కోరారు. గతంలో కూడా అనేకమార్లు స్థానిక (సిపిఐ) భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులను ఏఐటీయూసీ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాల వల్ల దానిని పట్టించుకోలేదని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అయినా కల్పించుకొని వెంటనే హిందుస్థాన్ జింక్ పరిశ్రమను ప్రారంభించడానికి తగిన కృషి చేయవలసిందిగా ఆయన కోరారు. సిపిఐ బొల్లాపల్లి మండల కార్యదర్శి పిన్నేబోయిన వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఎం నాయకులు హనుమంత రెడ్డి బొంకూరి వెంకటేశ్వర్లు, టిడిపి పట్టణ అధ్యక్షులు ఆయూబ్ ఖాన్, పత్తి పూర్ణ, ప్రజా సంఘాల నాయకులు విజయ్, ఆర్కే నాయుడు, ఆర్. వందనం, షేక్ కిషోర్, ఎస్. సాంబయ్య, షేక్ మస్తాన్, కె. మల్లికార్జున,ఆర్టీసీ యూనియన్ నాయకులు సంజీవరావు, హబిబ్ భాషా, మాలపాడు బండ్ల మోటు పూర్వపు ఉద్యోగ సంఘాల నాయకులు అచ్చటి ప్రజలు బండ్లమోటు సీసపు గని ని ప్రారంభించవలసిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి మండల గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు, సానుభూతిపరులు, తదితరులు పాల్గొన్నారు. (Story : బొల్లాపల్లిలో బండ్లమోటు సీసపు గని ని తిరిగి ప్రారంభించాలి)