Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 13 నవోదయ విద్యాలయాలు, రెండు ఎయిమ్స్‌ల‌కు బడ్జెట్‌ సహాయం అందించాలి

13 నవోదయ విద్యాలయాలు, రెండు ఎయిమ్స్‌ల‌కు బడ్జెట్‌ సహాయం అందించాలి

0

13 నవోదయ విద్యాలయాలు, రెండు ఎయిమ్స్‌ల‌కు బడ్జెట్‌ సహాయం అందించాలి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ లింగమనేని రమేశ్ వినతి

న్యూదిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్వీ) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్‌ సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా, 15 జిల్లాల్లో మాత్రమే జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరై, ప్రస్తుతం పనిచేస్తున్నాయని ఎంపీ లింగమనేని రమేశ్ తెలిపారు. దీంతో 13 జిల్లాలు నవోదయ విద్యాలయాలు లేకుండా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలను విస్తరించడం ద్వారా నాణ్యమైన విద్యకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఎంపీ పేర్కొన్నారు. అనుభవాత్మక విద్య, డిజిటల్ విద్య, మోడల్ పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలకు కూడా ఈ విస్తరణ తోడ్పడుతుందని తెలిపారు.

2024 డిసెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి ₹2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని లింగమనేని రమేశ్ గుర్తుచేశారు. అదే ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు ₹1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో నవోదయ విద్యాలయాలు లేని మొత్తం 13 జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ ఆమోదంతో పాటు తగిన బహువార్షిక బడ్జెట్ కేటాయింపులు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఎంపీ తన వినతిపత్రంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యా, వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారని, దాని ఫలితంగా ఎయిమ్స్ మంగళగిరి ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లాలు, విస్తారమైన భౌగోళిక విస్తీర్ణం, గిరిజన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మరో రెండు ఎయిమ్స్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లింగమనేని రమేశ్ తెలిపారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం, వైద్య విద్య, పరిశోధన రంగాలు మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ఎంపీ తెలిపారు. అధునాతన వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి ముందుగా సాధ్యాసాధ్యాల అధ్యయనం, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం ప్రారంభ బడ్జెట్ కేటాయింపులు చేయాలని, అనంతరం సంస్థ ఏర్పాటుకు అవసరమైన మూలధన నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు.

ఈ రెండు ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్య, ప్రపంచ స్థాయి వైద్య సేవలకు మరింత విస్తృత ప్రాప్తి కల్పించడంతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందుతుందని లింగమనేని రమేశ్ తెలిపారు. ఈ ప్రతిపాదనలు జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలు, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, వికసిత్ భారత్ @2047 లక్ష్యాలకు కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన బడ్జెట్ సహాయాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఎంపీ లింగమనేని రమేశ్ ప్రకటించారు. (Story: 13 నవోదయ విద్యాలయాలు, రెండు ఎయిమ్స్‌ల‌కు బడ్జెట్‌ సహాయం అందించాలి)

Top Stories You Can See

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version