కంగుతిన్న వైసీపీ శ్రేణులు
వల్లభనేని వంశీ అరెస్టు: బెజవాడలో అలజడి
హైదరాబాద్‌లోనే అరెస్ట్: విజయవాడకు తరలింపు
వెంటాడుతున్న టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
న్యూస్ తెలుగు/అమరావతి: ఎట్టకేలకు వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంభనేని వంశీని పోలీసులు హైదరాబాద్‌లో గురువారం అరెస్టు చేశారు. అతని ఇంటికి నోటీసులు అంటించారు. ఈ అరెస్టులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్న అనంతరం అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది.
వల్లభనేని వంశీ అరెస్ట్‌లో ట్విస్ట్ నెలకొంది. హైదరాబాద్ రాయదుర్గంలో ఒక అపార్ట్‌మెంట్‌లో వంశీ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు గురువారం తెల్లవారు జామున అక్కడకు పోలీసులు చేరుకున్నారు. పోలీసులను చూసి వెంటనే డ్రస్ మార్చుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తన అనుకూల ఛానళ్లకు ఫోన్లు చేసి పిలిపించాడు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చాడు. వంశీ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. వంశీ అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. గన్నవరానికి చెందిన ఆ పార్టీ నేతలు, అనుచరులు పెద్దఎత్తున విజయవాడకు తరలివస్తున్నారు. ఈ కేసులో ఊహించని రీతిలో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్య వర్ధన్‌ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి మొత్తం ఐదుగురుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల ఓటమి అనంతరం విజయవాడలోని వంశీ నివాసంపైనా టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వంశీ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడంలేదు. ఈ క్రమంలో ఊహించని రీతిలో వంశీ అరెస్టు వైసీపీలో అలజడిని రేపింది. (Story: వల్లభనేని వంశీ అరెస్టు: బెజవాడలో అలజడి)
Follow the Stories:
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!