చంద్రబాబు చాణిక్యం ఫలించేనా?
పట్టభద్రుల పోరు రసవత్తరం
మున్సిపోల్స్ గెలుపుతో కూటమి ఉత్సాహం
టీపీ, పీడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ
బరిలో వలంటీర్ల తరపు అభ్యర్థులు
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి కూటమి దూరం
3 స్థానాల్లో పోటీకి వైసీపీ వెనక్కి..
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి వశం కానున్నాయా?, లేదా గట్టి పోటీ తప్పదా? అనేదీ కొన్ని రోజుల్లో తేలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఘన విజయం సాధించాక..ఇవి రెండో విడత ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏకకాలంలో రెండు పట్టభద్రులకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఉప పోరులో తన సత్తా చాటిన కూటమి పార్టీలు..ఈ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించేందుకు సన్నద్ధమయ్యాయి. ఆ దిశగా సీఎం చంద్రబాబు తన రాజకీయ అనుభవం, చాణక్యంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు వ్యూహాత్మకంగా అభ్యర్థుల్ని కూటమి నుంచి బరిలోకి దించారు. ఈ నెల 27న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు ఎన్నికలు జరగనున్నాయి. వాటికి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం..ఇక రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి పెట్టింది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా నిలిచింది. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజాను బరిలోకి దించింది. ఈయనకు పోటీగా ప్రోగ్రెసివ్ డెమోక్రసీ ఫోరమ్ (పీడీఎఫ్) తరపున కేఎస్ లక్ష్మణరావు ఉన్నారు. ప్రస్తుతం కేఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం కొన్ని రోజుల్లో పూర్తికానుంది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ప్రచారంతో విస్తృతంగా దూసుకుపోతున్నారు.
శాసన మండలిలో టీడీపీకి బలం లేకపోవడంతో ఈ దఫా ఎలాగైనా ఈ సీటును కైవసం చేసుకోవాలన్న ధీమాతో టీడీపీ ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖరం పేరును ఖరారు చేశారు. అక్కడ పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు బరిలో నిలిచారు. ఈ రెండు పట్టభద్రుల స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఏపీటీఎఫ్(257) నుంచి పాకలపాటి రఘువర్మ కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ మళ్లీ ఆయన పోటీకి దిగారు. ఇదే ఎమ్మెల్సీ నియోజకవర్గానికి యూటీఎఫ్ నుంచి విజయగౌరి, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కూటమి దూరంగా ఉంది. అటు మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు.
మంత్రులకే గెలుపు బాధ్యతలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులకు సీఎం చంద్రబాబునాయుడు అప్పగించారు. వారితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు భాగస్వామ్యం అయ్యేలా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలు, తాజాగా మున్సిపల్ ఉప ఎన్నికల్లోనూ పరాజయం వెరసి డీలా పడిపోయిన వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. తమ అభ్యర్థుల గెలుపు సులభమని కూటమి పార్టీలు ఆశిస్తున్నప్పటికీ, అంతర్గతంగా పీడీఎఫ్ అభ్యర్థులకు వైసీపీ మద్దతిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమ గెలుపు ఏకపక్షమని భావించిన కూటమిలోని టీడీపీ అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ప్రచారాన్ని పోటాపోటీగా ముమ్మరం చేశారు. పట్టభద్రుల ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్ల వివరాలతో అభ్యర్థులు మెస్సేజ్‌లు పంపుతున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా..ఈ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఎన్నికలకు షెడ్యూలు రాకముందే, రెండు జిల్లాల్లోని పట్టభద్రులను, విద్యావంతులను ఆయన కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఆలపాటి రాజా విజయాన్ని కాంక్షిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు సైతం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనుంది.
ఎమ్మెల్సీ బరిలో వలంటీర్లు!
కృష్ణా-గుంటూరు, గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో వలంటీర్లు పోటీకి దిగడం కూటమి పార్టీకి మింగుడు పడటంలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకిచ్చిన హామీని అమలు చేయకపోవడంతో..వలంటీర్లు ఉద్యమబాట పట్టారు. ఇటీవల విజయవాడలో వలంటీర్ల అధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీగా వలంటీర్ల తరపున వానపల్లి శివగణేశ్, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వలంటీర్ల తరపున లంకా గోవింద రోజులు పోటీకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒక్కో ఎమ్మెల్సీ నియోజకవర్గానికిగాను దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒక్కోచోట దాదాపు లక్షన్నర ఓటర్లను చేర్పించారు. కూటమి పార్టీల అభ్యర్థుల విజయంపై నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనూహ్యంగా వలంటీర్లు తరపున అభ్యర్థులు రంగంలోకి దిగడం, వారికి ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉండటంతో ఎంతటి ప్రభావం చూపుతారనే చర్చానీయాంశంగా మారింది. వలంటీర్లు విజయం సాధించే అవకాశాలు లేకపోయినప్పటికీ, వారికి దక్కే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేసే అవకాశముంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో సేవలు అందించిన వలంటీర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టింది. అనేక సార్లు ప్రభుత్వానికి వినతులు అందజేసినా, వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా స్పందించకపోవడంతోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వలంటీర్లు పోటీకి సిద్ధమైనట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి వలంటీర్లే కారణమనే అభిప్రాయముంది. వైసీపీ కేడర్‌ను, నాయకులను పట్టించుకోకుండా వలంటీర్లకు పెద్దరికం ఇవ్వడం వల్లే కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటిగా రాజకీయ విశ్లేషకులమాట. మొత్తంమద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. (Story: చంద్రబాబు చాణిక్యం ఫలించేనా?)