పెరిగిన ఫైన్లు ఎప్పటినుంచి అంటే..?
హెల్మెట్ లేకపోతే..సీను సితారే!
విజయవాడ నగరంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
చలనాలు పెండింగ్ లో ఉన్న(90 రోజులు దాటిన) వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
మార్చి ఒకటి నుండి నూతన మోటార్ వాహన చట్టం అమలు (పెరిగిన ఫైన్లు)
న్యూస్‌తెలుగు/విజయవాడ: విజయవాడ నగరంలో బైక్‌లు నడిపేవారికి హెల్మెట్‌ను పోలీసులు తప్పనిసరి చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ హెల్మెట్ ధరించాల్సిందేనని, లేకపోతే అపరాధ రుసుములు భారీగా వేయడం జరుగుతుందని విజయవాడ నగర పోలీసులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే పెరిగిన ఫైన్లు మార్చి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. విజయవాడ నగరంలో ద్విచక్ర వాహన దారులు శిరస్త్రాణం ధరించకపోవటంపై ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. రోడ్డు ప్రమాదాలు పెరిగి మృతులు సంఖ్య పెరగటంపై ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు కొన్ని సూచనలు చేసింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వాహనం నడుపునపుడు శిరస్త్రాణం పెట్టుకోవాలని, ఎవరైతే వాహనదారులు ఉల్లంఘనకు పాల్పడతారో అట్టి వాహన దారునికి అధికంగా జరిమానా విధించాలని, 90 రోజులు లోపల జరిమానా కట్టని వారి వాహనములు సీజ్ చేయాలని, తరచూ మోటారు వాహన చట్టము ఉల్లంఘించిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేయుచూ రవాణా శాఖ వారికి ప్రతిపాదన పంపాలని కూడా ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమీషనర్ఎ స్. వి. రాజ శేఖర్ బాబు సూచన మేరకు నగర ట్రాఫిక్ విభాగం, శాంతి భద్రత విభాగాలు నగరంలో, జిల్లాలో సదరు సూచనలపై అవగాహన కల్పిస్తూ 19-12-2024 నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించుట వలన వారి విలువైన ప్రాణములు కాపాడుకోవాలని విన్నవించుచూ, అవగాహన కల్పిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. చాలామంది ద్విచక్ర వాహనదారులు హై కోర్టు సూచనలు గౌరవించి శిరస్త్రాణం ధరించి వాహనంనడుపుతున్నారు. కాని అత్యధిక వాహనదారులు పోలీసు వారు మోటారు వాహన చట్టం ఉల్లంఘనలపై విధించిన ఈ-చలానా జరిమానాలు కట్టకుండా ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేయడం, కొంత అవగాహన లేకపోవడం వలన కూడా చాలా ఈ చలాన్లు పెండింగ్ వున్నాయి.
ఈ నేపథ్యంలో పోలీసు కమీషనర్ గారిఆదేశాల ప్రకారం 03-02-2025 మరియు 04-02-2025 వతేదీలలో 90 రోజుల పైన జరిమానా కట్టకుండా వున్న వాహనాలను తనిఖీ చేసి 141 వాహనములను సీజ్ చేయడమైనది. వారు వారి వాహనంపై ఉన్న జరిమానాలు కట్టిన పిదప వారి వాహనములను విడుదల చేసేలా ఏర్పాట్లు చేశారు. కావున యన్.టి.ఆర్ జిల్లా మరియు విజయవాడ నగరంలోని వాహనదారులు వారి వాహనములపై వున్న 90 రోజులు దాటి వున్న ఈ చలాన్ లను వెంటనే ఈ పరివాహన యాప్ ద్వారా గాని, మీ సేవలో గాని వెంటనే జరిమానా కట్టి పెండింగ్ లో లేకుండా చూసుకోవలసిందిగా పోలీసులు కోరుతున్నారు.
కాగా, 01-03-2025 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం నూతన మోటారు వాహన చట్ట నిభంధనల ప్రకారం మోటారు వాహన చట్ట ఉల్లంఘనలపై పెంచిన జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ఉదా: ప్రస్తుతం హెల్మెట్ ఉల్లంఘన పై రూ.135/-లు వున్నా జరిమానా రూ.1,000/-లు విధించబడును. అంతేకాక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినచో కొత్త చట్ట ప్రకారం రూ 10,000/- విధించబడుతుంది. ఇతర ఉల్లంఘనలు కూడా కొత్త మోటారు వాహన చట్టంలో జరిమానాలు పెంచినట్లు తెలియచేస్తూ, ఈ విషయం వాహన దారులు గమనించి నిబంధనలు పాటించవలసినదిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు అమలుపర్చడంలో 1-03-2025 నుండి పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారని ప్రకటించారు. (Story: హెల్మెట్ లేకపోతే..సీను సితారే!)