మావోల కింకర్తవ్యం ఏమిటి ?
* సమాంతర పాలనకు జీవన్మరణ సమస్య
* అడవుల్లో 650 పోలీస్ క్యాంపులు, 70 వేల బలగాలు
* సత్తా కూడగట్టుకుంటారా? *
కొండపల్లి మాటలను ఆచరిస్తారా
న్యూస్ తెలుగు/భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ దండకారణ్యములో దశాబ్దాలుగా సాగుతున్న మావోయిస్టుల సమాంతర పాలన ప్రస్తుతం జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటుంది. పచ్చని అడవులు నెత్తుటి ధారలతో తడిసి ముద్దవుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతోంది సాధారణ దళ సభ్యులకే కాదు.. కేంద్ర కమిటీ స్థాయి అగ్ర నేతలకూ అడవుల్లో షెల్టర్ జోన్లు కరువవుతున్నాయి. అడవుల్లో నిత్యం తుపాకుల మోతల మోత మార్మోగుతుండగా, భద్రతా బలగాల తూటాల ధాటికి గడచిన ఏడాది వ్యవధిలోనే వందలాది మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు.*
అడవుల్లో బలగాల మకామ్///
ఛత్తీస్ గఢ్ అడవుల్లో దాదాపు 650 పోలీస్ క్యాంపులు.. సుమారు 70 వేల మంది పోలీసు బలగాల మకాం వేశాయి. నలువైపులా చుట్టుముట్టిన భద్రతా బలగాలు.. మావోయిస్టులపై అమ్మో పేట దాడికి దిగుతున్నాయి. ఇంతకలాం షెల్టర్ జోన్ గా ఎంచుకుని ప్రాబల్యాన్ని సంపాదించి ఇరవై ఏళ్లపాటు పోటీ ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఆపరేషన్ కగార్////
ఆపరేషన్ కగార్ లో భాగంగా
పాలకులు తమ టార్గెట్ ఏమిటో స్పష్టంగానే చెబుతున్నారు. వచ్చే మార్చి నెలాఖరుకల్లా మావోయిస్టు పార్టీని తుద ముట్టించి, మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటిస్తున్నారు. తాజాగా ఛత్తీస్ గడ్- ఒడిస్సా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై ఆయన జవాన్లపై ప్రశంసల జల్లు కురిపించి భద్రతా బలగాలు సాధించిన భారీ విజయంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పం, భద్రతా బలగాల ఉమ్మడి ప్రయత్నాలతో దేశంలో మావోయిస్టు పార్టీ కొన ఊపిరితో ఉందని అమిత్ షా తన ‘ఎక్స్’ ఖాతాలో వ్యాఖ్యానించారు. రాజ్యం అత్యంత బలంగా ఉందని విప్లవోద్యమ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్య శక్తిని ఎదుర్కునే సత్తా సంగతి ఎలా ఉన్నప్పటికీ, కనీసం ప్రతిఘటించే పరిస్థితుల్లోనూ మావోయిస్టు పార్టీ లేదని బాహాటంగానే చెబుతున్నారు. ఇటువంటి పరిణామాల్లో మావోయిస్టు ఏం చేయాలి? వారి ముందున్న కర్తవ్యమేంటి? ఆఖరి పోరాటంగా రాజ్యంతో తలపడడమా? పోరాడలేక ప్రభుత్వానికి లొంగిపోవడమా? ప్రత్యామ్నాయంగా మరో షెల్టర్ జోన్ కు తరలివెళ్లడమా? లేదంటే అనివార్యంగా కొండపల్లి సీతారామయ్య ప్రతిపాదించిన మార్గాన్ని అనురించడమా? తరిమెల నాగిరెడ్డి చెప్పిన సూత్రాన్ని పాటించడమా? మావోల కింకర్తవ్యం? ఇవీ తాజా ప్రశ్నలు.
తాజా పరిణామాలపైనే విశ్లేషిస్తే.. సాయుధ పోరాట పంథాలో హింసను మాత్రమే మావోలు ఎక్కువగా విశ్వసించారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కున్న పరిణామాలపై, ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలో కనీసం పది నిమిషాలు ఓచోట నిలబడే పరిస్థితులు సాయుధ నక్సల్స్ కు లేకుండాపోవడానికి గల కారణాలపై పార్టీ విశ్లేషించుకున్నదా? అనేది కూడా ఓ ప్రశ్న. సిరిసిల్ల, జగిత్యాల జైత్ర యాత్రలను నిర్వహించిన చారిత్రక ఘటనల నుంచి ఛత్తీస్ గఢ్ వైపు షెల్టర్ కోసం షిఫ్ట్ కావలసిన పరిణామాలపై పార్టీ సమీక్షించుకున్నదా? అనేది కూడా మరో ప్రశ్న. ప్రజల్లో వచ్చిన మార్పులను అనుగుణంగా పోరాట మార్గాన్ని మార్చుకోవడంలో దృష్టి సారించారా? అనేది ఇంకో ప్రశ్న. మొత్తంగా దట్టమైన అడవులతో అల్లుకున్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రం దాదాపు ఇరవై ఏళ్లపాటు మావోలకు పెట్టని కోటలా రక్షణ కల్పించింది. అబూజ్ మడ్ వంటి ప్రాంతాలు శత్రువును అడుగు మోపనీయకుండా మావోలకు సురక్షితంగా ఉన్నాయి. జనతన సర్కార్ పేరుతో దంతెవాడ, బీజాపూర్, కాంకేర్, నారాయణ్ పూర్ వంటి పలు ఉమ్మడి జిల్లాల్లో పోటీ ప్రభుత్వాన్ని నడిపేంతగా నక్సల్స్ రాజ్యం నడిపారు.
కానీ ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. నక్సలిజాన్ని తుదముట్టించే లక్ష్యంతో పాలకులు పకడ్బందీ వ్యూహాలను రచించి అమలు చేస్తున్నారు. గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్.. పేరు ఏదైనా మావోలనే ఏరివేయడమే టార్గెట్ గా ఎంచుకున్న ప్రణాళికలు. తెలంగాణాలో నిర్బంధం తీవ్రతరమైతే ఛత్తీస్ గఢ్ కు వలస వెళ్లిన మావోలు ప్రస్తుతం అక్కడి పరిస్థితుల నేపథ్యంలో జార్ఖండ్ వైపు తరలివెళ్లేందుకు సమాయత్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనగా వార్తలు వస్తున్నాయి. ఇటు తెలంగాణా వైపు నుంచి, అటు ఒడిషా వైపు నుంచి.. నలువైపులా భద్రతా బలగాలు చుట్టుముడుతున్న పరిస్థితులు మావోలకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నట్లు విశ్లేషకుల వాదన. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ముందున్న మార్గమేంటి? అనే ప్రశ్నపైనా విప్లవ కార్యకలాపాల పరిశీలకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తరిమెల నాగిరెడ్డి చెప్పిందేమిటి?.ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలను విడనాడి చేసే ఏ పోరాటాలుగాని, మరే ఉద్యమాలుగాని విజయం సాధించలేవని ఆయన విస్పష్టంగా చెప్పారు. అనేక విప్లవ పార్టీలు ఈ ఫార్ములాను విడనాడి ‘సాయుధ’ సాము చేయడంవల్లే పెద్ద ఎత్తున నష్టపోయాయనే వాదనలు లేకపోలేదు. పరిస్థితులకు అనుగుణంగా సాయుధ పోరాటానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రతిపాదించిన కొండపల్లి సీతారామయ్య మార్గాన్ని అనుసరించడం మినహా మరో మార్గం మావోలకు ప్రస్తుతం లేదా? అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఎదురవుతోంది. అప్పట్లో కొండపల్లి చేసిన ఈ ప్రతిపాదనవల్లే నాయకత్వ మార్పు జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరామం ఇచ్చి, రైతులను, కూలీలను, విద్యార్థులను సమీకరించి లీగల్ పోరాటాలు చేయాలని తలపోసిన కొండపల్లి సీతారామయ్య మార్గమే మావోలకు ఇప్పుడు శరణ్యమా? అనే చర్చ కూడా మొదలైంది. పోరాటాలను వదిలి ‘యుద్ధం’ మాత్రమే చేస్తున్న మావోలు బలంగా ఉన్న రాజ్యం ముందు ప్రస్తుతం నిలబడగలరా? అనే సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గత, ప్రస్తుత పరిణామాలు పరిశీలించినపుడు 2026 మార్చికల్లా నక్సలిజాన్ని తుదముట్టిస్తామని ప్రతిన పూనిన పాలకుల శక్తిని ఎదుర్కునేందుకు మావోయిస్టులు తమ సాయుధ ‘పంథా’ను మార్చుకుంటారా? లీగల్ పోరాటాలను ఆశ్రయిస్తారా? లేక ఆయుధాలతో శక్తివంతమైన రాజ్యంతో ‘యుద్ధం’ మాత్రమే చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.(Story : మావోల కింకర్తవ్యం ఏమిటి ? )