వినుకొండలో త్వరలోనే బ్రాహ్మణ భవన నిర్మాణం సాకారం
బ్రాహ్మణ కార్తిక వనసమారాధన మహోత్సవంలో పాల్గొన్న జీవీ, మక్కెన
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండలో త్వరలోనే బ్రాహ్మణ భవన నిర్మాణం సాకారం చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. అదే సమయంలో బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించే విషయంలో తనవంతు సాయం కూడా అందిస్తానని ఆయన ప్రకటించారు. వినుకొండ శ్రీనివాస నగర్ వెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో ఆదివారం బ్రాహ్మణ కార్తిక వనసమారాధన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు,మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. వారిద్దరిని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ బ్రాహ్మణుల కార్తిక వనసమారాధన మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వినుకొండ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు సాగుతానన్నారు. రామలింగేస్వరస్వామి గుడి నిర్మాణం, మెట్లమార్గం పూర్తి, వినుకొండ పట్టణం అభివృద్ధికి ప్రజలూ సహకరించాలని కోరారు. తితిదే కల్యాణ మండపం, ఎన్నెస్పీ స్థలంలో క్రికెట్ మైదానం, పార్కు నిర్మాణంతో పాటు అపరికర్మల సత్రం నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నానన్నారు. బ్రాహ్మణుల్లో ఆర్థికంగా స్థిరపడినవారు మిగిలిన వారికి అండగా ఉండాలని కోరారు. బ్రాహ్మణ సంఘం తరఫు న విద్యా ర్థుల ఉపకార వేతనాల కోసం రూ.5 లక్షలకు తక్కువ కాకుండా వసూలు చేస్తే తాను ఇచ్చే రూ.50 వేలతో కలిపి పేద పిల్లలకు సహాయం అందిద్దామని పిలుపునిచ్చారు. ఇల్లు లేని బ్రాహ్మణులకు వారి విజ్ఞప్తి మేరకే టిడ్కో ఇళ్లు అందేలా చర్యలు చేపడతామన్నారు. వారికి భవిష్యత్తులోనూ తన అండదండలు, సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మారుతి వరప్రసాద్ రావు, శివశక్తి మేనేజర్ జీవీ రమణ రావు, పీవీ సురేష్ బాబు, గాలి శ్రీనివాసరావు, భాగవతుల రవికుమార్ తదితరులు ఉన్నారు. (Story : వినుకొండలో త్వరలోనే బ్రాహ్మణ భవన నిర్మాణం సాకారం)