Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు

రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు

0

రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు

•దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ
•ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం
•9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన
•స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి
• గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళిక
• పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం
• గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం
• సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపడతాము
• విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

‘ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం. దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయనున్నారని తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నామన్నారు. దీనిద్వారా మొత్తం 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన దేశంలో ఎన్నడూ లేనట్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చిచేందుకు మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం మంగళగిరిలోని ఆయన ప్రైవేట్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘దేశంలోనే పంచాయతీ వ్యవస్థను మొదలు పెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది. రెండో తరం సంస్కరణలతో పంచాయతీల నలుదిశల విప్లవం మన రాష్ట్రం నుంచే ఇప్పుడు మొదలుపెడుతున్నాం. గత మూడు దశాబ్దాలుగా పంచాయతీలకు జాతీయ పండుగల నిర్వహణకు మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా మైనర్ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.25 వేలు నిధులను పెంచి పంచాయతీలకు అండగా ఉంటామని భరోసాను ఇచ్చాం.
• మన గ్రామాన్ని మనమే పరిపాలించుకుందాం
పంచాయతీ సంస్కరణలు కొనసాగింపులో భాగంగా ఈ నెల 23వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తాం. మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం అనేలా వీటి నిర్వహణ ఉంటుంది.
భారతదేశపు మూలాలు, జీవం పల్లెల్లోనే ఉంటుందని మహాత్మా గాంధీ చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్ర పంచాయతీలను స్వయంశక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పంచాయతీలకు ఉండే అధికారాలను గ్రామాల అభివృద్ధికి ఉపయేపడేలా చేసి… పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
• గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో 2019-2023 సంవత్సరం వరకు రూ.40,579 కోట్లు నిధులు వచ్చాయి. ఈ పనుల పూర్తిస్థాయి ఫలితాలు మాత్రం క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. గ్రామీణాభివృద్ది కోసం ఈ నిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి. కానీ గత ప్రభుత్వంలో ఈ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేశారు. కరోనా సమయంలో ఈ నిధులను ఇష్టానికి వాడుకున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2014-19 వరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల ఆదాయం రూ.240 కోట్లు ఉంటే, 2019-23 సంవత్సరాల్లో ఆ ఆదాయం గణనీయంగా తగ్గి కేవలం రూ.170 కోట్లే వచ్చింది. క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణం. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు సర్వ స్వతంత్రత తీసుకురావాలనే సంకల్పంతో పని చేస్తోంది. పంచాయతీలు వాటి కాళ్ల మీద అవే నిలబడి స్వయం సమృద్ధి సాధించేలా తయారు చేయాలనే పట్టుదలతో ఉన్నాం. పంచాయతీలకు సంబంధించిన విద్యుత్తును అవే ఉత్పత్తి చేసుకునేలా, వాటి ఆదాయం అవే సంపాదించుకునేలా తయారు చేస్తాం. రాష్ట్రాభివృద్ధిలోనే కాకుండా దేశాభివృద్ధిలోనూ రాష్ట్ర పంచాయతీలు కీలకంగా వ్యవహరించేలా తయారు చేస్తాం.
• పంచాయతీల ప్రత్యేకతను గుర్తించి ఆదాయం సృష్టిస్తాం.
రాష్ట్రంలోని గొప్పదనం ఏమిటంటే ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కళలు, ఆహార పదార్ధాల తయారీ, వస్త్రాల తయారీ, ఇతర కళాకృతుల తయారీ వంటి వాటికి మన గ్రామాలు ప్రత్యేకం. విశాఖపట్నం జిల్లాలో ఆనందపురంలో పూలు ప్రసిద్ధి. అరకులో అరకు కాఫీకు ప్రత్యేకత ఉంది. మంగళగిరి చీరలు, సత్యసాయి జిల్లాలో లేపాక్షి, బాపట్లలో వేటపాలెం గ్రామం, కృష్ణాజిల్లాలో చిలకలపూడి, కొండపల్లి హస్త కళలకి ప్రసిద్ధి. ఇలాంటివి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలను గ్రామ సభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నాం. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగుమతులు చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషిస్తాం. గ్రామసభలకు యువత, మహిళలు విరివిగా పాల్గొవాలి. పంచాయతీల్లో మహిళలు ఎక్కువగా పాల్గొవాలని కోరుకుంటున్నాను.
• పంచాయతీల ఆదాయం పెంచేలా సామాజిక అడవుల పెంపకం
పంచాయతీల్లో చాలా భూమి నిరు పయోగంగా ఉంటోంది. దాన్ని క్రమ పద్ధతిలో వినియోగించుకోవాలి. స్వచ్ఛ భారత్ ను మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీల్లో ఓ ప్రణాళిక ప్రకారం ఎక్కడా చెత్త లేకుండా క్లీన్, గ్రీన్ గ్రామాలుగా తయారు చేసేలా దృష్టిపెడుతున్నాం. డెన్మార్క్ అనే చిన్నదేశం నుంచి కలపను మన దేశం అధికంగా దిగుమతి చేసుకుంటోంది. రూ.6 వేల కోట్ల విలువైన కలపను ఏటా దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత మొత్తం విదేశీ మారక ద్రవ్యం కేవలం కలప కోసం ఇంత వెచ్చిస్తున్నాం. గ్రామ పంచాయతీలకు సంబంధించి వృథాగా ఉన్న స్థలంలో సామాజిక అడవి విభాగంలో కలపను పెంచాలని భావిస్తున్నాం. దీని ద్వారా పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నరేగా పనులను అటవీ శాఖకు అనసంధానం ఉంది. మూగ జీవాలకు నీటి వసతి కల్పించేలా గుంతలను తవ్వడం వంటి వాటికి ఉపయోగిస్తాం. గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రత్యేకతలను తిలకించేలా పర్యాటకులను ప్రొత్సహిస్తాం.
• గత ప్రభుత్వంలో సోషల్ ఆడిట్ బలహీనం చేశారు
గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ పనులు, ఉపాధి పనుల్లో చాలా అవకతవకలు జరిగాయి. జల్ జీవన్ మిషన్ పథకం పనులకు పైపు లైన్లు వేసి వదిలేశారు. వాటికి కనెక్షన్ ఇవ్వలేదు. మరోపక్క పైపులైన్ల కోసం తవ్విన పనులు ఉపాధి హామీ పథకంలో చేశారు. అసలు ఏ పనులు దేనికి చేశారో గ్రామ సర్పంచులకు తెలియదు. మస్తర్ బుక్ లో సంతకాలు పెట్టించుకోవడం తప్పితే, సర్పంచులకు ఏ పనులు ఎక్కడ చేశారన్న వివరాలు చెప్పలేదు. దీనిలో బోలెడు అవకతవకలు జరిగాయి. నిధుల దుర్వినియోగం దారుణంగా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పనులను పర్యవేక్షించాల్సిన, నిధుల దుర్వినియోగం అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పని చేయలేదు. సామాజిక తనిఖీ విభాగానికి కూడా పోలీస్ అధికారిని హెడ్ గా పెట్టాలని ఆలోచిస్తున్నాం. దీనిపై అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. గత ప్రభుత్వంలో సోషల్ ఆడిట్ విభాగం బాధ్యుడిని తప్పించాము. రకరకాల అభియోగాలు వచ్చిన అధికారులను పక్కన పెట్టాం. నిఘా విభాగంపై నిఘా పెట్టాల్సి వచ్చింది. పంచాయతీల్లో సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు ఉండాలి. దాన్ని ప్రతి పంచాయతీల్లో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉండిపోయిన రూ.2 వేల కోట్ల నిధులను కూటమి ప్రభుత్వంలో విడుదల చేశాం. మెటీరియల్ కంపోనెంట్ గ్రాంట్ ను త్వరలోనే ఇస్తాం.
• నీటి పునర్వినియోగంపై దృష్టి
నీటి కోసం గ్రామాల్లో బోర్లు హద్దులు దాటి వేస్తున్నారు. దీనివల్ల ఫ్లోరైడ్ ఎక్కువగా పడుతోంది. భూమి పొరలను దాటి నీటి కోసం లోతులకు వెళ్తున్న కొద్దీ ఫ్లోరైడ్ వస్తోంది. నీటిని పునర్వినియోగంపై దృష్టి సారించాలి. అప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయి. తక్కువ దూరంలోనే నీళ్లు లభిస్తాయి. ప్రస్తుతం గ్రామాల్లో పల్స్ సర్వే చేస్తున్నాం. పంచాయతీల్లో నీటి పరిస్థితిపై 16 అంశాలతో సర్వే నిర్వహిస్తున్నాం. 22 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది. ఇది రాష్ట్రం మొత్తం మీద పూర్తయితే అన్ని పంచాయతీల్లో ఉన్న వాటర్ సోర్సు మీద ఓ స్పష్టత వస్తుంది. అప్పుడు ఓ ప్రణాళిక ప్రకారం నీటి సమస్యను తీర్చేందుకు ముందుకు వెళ్తాం.
• విశాఖలో పరిశ్రమల కాలుష్యం మీద నిఘా పెడతాం
అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. వరుసగా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎసెన్షియా ఫాక్టరీలో రక్షణ చర్యలు చేపట్టడంలో ఆ పరిశ్రమలకు చెందిన ఇద్దరు యజమానుల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలు కూడా ఓ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్ చేయడం మీద దృష్టి పెడతాం. సేఫ్టీ ఆడిట్ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలతో ఒకసారి కూర్చొని మాట్లాడదామని, తీసుకుంటున్న రక్షణ చర్యలు వివరించాలని కోరుతాను. ఇప్పటికే హిందూస్తాన్ షిపింగ్ యార్డు వారితో ఒకసారి మాట్లాడాను. మీరు తీసుకుంటున్న రక్షణ చర్యలు చెప్పాలని కోరితే, వారు బాగానే తీసుకుంటున్నాం అని చెబుతున్నారు కానీ పూర్తి భద్రత ఇవ్వాలనేది ప్రాథమిక బాధ్యత. సేఫ్టీ ఆడిట్ ను కఠినంగా అమలు చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని, వారు ముందుకు రారని చెబుతున్నారు. అయితే పరిశ్రమలు కచ్చితంగా అక్కడి పనిచేసే వారికి కనీస రక్షణ పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమల్లో రక్షణ అంశం మీద నేనే ప్రత్యేకంగా దృష్టి పెడతాను. ఈ నెల చివర్లో విశాఖపట్నంలో ప్రత్యేకంగా దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో రోజురోజుకీ కాలుష్యం పెరుగుతోంది. దీన్ని అరికట్టడంపై దృష్టి పెడతాం. పరిశ్రమల కాలుష్యం మీద నిరంతర నిఘా ఉండేలా, ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూడాలి’’ అన్నారు. (Story : రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version