మోటారు వాహన చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణంలో మోటారు వాహన చట్టం ఉల్లంఘించిన వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ సిఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ఎసైలు శంబాన రవి, లోవరాజు, ఎ.మహేశ్వర రాజు, త్రినాథరావు లు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని గంట స్థంభం, ఆర్టీసి కాంప్లెక్స్, మూడు లాంతర్లు, కోట జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట రైతు బజారు, కొత్తపేట నీళ్ల ట్యాంకు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారన్నారు. ముఖ్యంగా మైనరు డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సౌండ్ పొల్యూషన్ కు కారకులైన వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారన్నారు. వీటితోపాటు ఇర్రెగ్యులర్ నంబరు ప్లేట్స్, నో నంబరు ప్లేట్స్ వాహనాలను కూడా ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహన తయారీలోని సైలెన్సర్ లో మార్పులు చేసి, శబ్ద కాలుష్యంకు పాల్పడడం తీవ్రమైన నేరమని వాహనదారులను హెచ్చరించారు. అటువంటి వాహనాల్ని గుర్తించి, సీజ్ చేసి, తదుపరి చర్యలు నిమిత్తం ట్రాఫిక్ పోలీసు స్టేషనుకు తరలించామన్నారు. మైనర్లకు, వారి తల్లిదండ్రులకు, వారికి వాహనాలు ఇచ్చిన వాహన యజమానులకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారుల పట్ల ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని, తదుపరి చర్యలు నిమిత్తం ఆర్టీఎ కార్యాలయానికి లేదా కోర్టుకు తరలించి, నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 104 మోటారు సైకిళ్లు సీజ్ చేశామని, వీటిలో ట్రిపుల్ రైడింగ్ 23 కేసులు, 41 మైనరు డ్రైవింగ్ కేసులు, 17 సౌండ్ పొల్యూషన్ కేసులు, ఇర్రెగ్యులర్ నంబరు ప్లేట్స్ వాహనాలపై 12 కేసులు, నో నంబరు ప్లేట్స్ కలిగిన వాహనాలపై 11 కేసులు, డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపై 3 కేసులు, ఎం.వి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 23 ఈ-చలనాలను ట్రాఫిక్ పోలీసులు విధించినట్లుగా తెలిపారు. (Story : మోటారు వాహన చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు)