కన్నుల పండుగగా స్వాతంత్య్ర దినోత్సవం పరేడ్ నిర్వహించాలి
జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం: 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో ఆగస్టు15న నిర్వహించే సాయుధ పోలీసులు పరేడ్ రిహార్సల్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పర్యవేక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గత రెండు రోజులుగా పోలీసు పరేడ్ గ్రౌండులో సాయుధ పోలీసులు పరేడ్ ప్రాక్టీసు చేపట్టారు. ఈ పరేడ్ ప్రాక్టీసును పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు ఇచ్చేందుకుగాను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పరేడ్ గ్రౌండులో నిర్వహించే పరేడ్ ప్రాక్టీసుకు హాజరై, సాయుధ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ నిర్వహణ తీరును పరిశీలించారు. ముందుగా జిల్లా ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసు వాహనంలో పరేడ్ పరిశీలనకు వెళ్ళి, సాయుధ పోలీసుల పరేడ్ ప్రాక్టీసు తీరును నిశితంగా పరిశీలించారు. కవాతు నిర్వహణలో అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు చేసారు. ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మరింత ఉత్సాహంగా, కన్నుల పండుగగా కవాతు ప్రదర్శన చేయాలన్నారు. ప్రజల్లోను, యువత, విద్యార్ధుల్లో దేశభక్తి, జాతీయ భావం మిన్నంటే విధంగా వేడుకల నిర్వహణ ఉండాలన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్య అతిధిగా హాజరుకానున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండు వద్ద భద్రత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్య అథిదులు, ప్రజల వాహనాలను వేరువేరుగా పార్కింగు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వేడుకలను చూసేందుకు విచ్చేసే ప్రజలను, యువత, విద్యార్థులను కుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే పరేడ్ గ్రౌండులోకి అనుమతించాలన్నారు. పరేడ్ గ్రౌండులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు రెవెన్యూ అధికారులు, ఇతరశాఖల సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన, తదితర వేడుకలకు విచ్చేయుచున్న ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజలకు కల్పించాల్సిన భద్రత సౌకర్యాలను సమీక్షించి, ఎవరికీ, ఎక్కడాఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఎఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం. సోల్మన్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఎస్బీ సిఐలు కే.కే.వి.విజయనాధ్, ఈ.నర్సింహమూర్తి, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్. గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.భగవాన్, ఆర్.ఎస్.ఐలు, సాయుధ పోలీసులు పాల్గొన్నారు. (Story : కన్నుల పండుగగా స్వాతంత్య్ర దినోత్సవం పరేడ్ నిర్వహించాలి)