లక్ష్యం మేరకు వన మహోత్సవం
మొక్కలు నాటి ఆన్లైన్ లో నమోదు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : లక్ష్యం మేరకు వన మహోత్సవం మొక్కలు నాటి ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వన మహోత్సవం కార్యక్రమం పురోగతి పై వెబ్ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన మధోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం వనపర్తి జిల్లాలో 18 లక్షల 39 వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 10 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించగా ఇరిగేషన్ శాఖకు 2 లక్షల మొక్కలు, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ ద్వారా మిగిలిన మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ తప్ప మిగిలిన శాఖలు పెద్దగా లక్ష్యాలు సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు నాటేందుకు వాతావరణం బాగా అనుకూలంగా ఉన్నందున వెంటనే స్థలాలు గుర్తించి పెద్దమొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.
వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి ఇచ్చే మొక్కలు పళ్ళ మొక్కలు అయి ఉండాలని పంచాయతీరాజ్ శాఖ అధికారిని ఆదేశించారు.
మొక్కలు నాటి ఆన్లైన్ లో నమోదు చేయాలని ఇదే అంశం పై శుక్రవారం సమావేశం ఉంటుందని ఎప్పటిలోగా మొక్కలు నాటి పూర్తి నివేదికతో రావాలని ఆదేశించారు.
జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, ఎంపీఒ లు తదితరులు వెబ్ ఎక్స్ సమావేశంలో పాల్గొన్నారు. (Story :లక్ష్యం మేరకు వన మహోత్సవం)