తెలంగాణ కాంగ్రెస్‌లో కుర్చీలాట!
సీఎం పదవి నుంచి మంత్రి పదవుల వరకూ మొదలైన కుమ్ములాటలు
రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వకుండా అడ్డుపుల్లలు
హైదరాబాద్ : అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుర్చీలాట మొదలైంది. ముఖ్యమంత్రి పదవి నుంచి మంత్రి పదవుల వరకూ కుమ్ములాటలు షురవయ్యాయి. అధిష్ఠానం మాటే శిరోధార్యం అంటూ చెప్పుకొచ్చిన నేతలు మాట మారుస్తూ వస్తున్నారు. సీఎం పదవికి రేవంత్‌రెడ్డి అర్హుడంటూ 90 శాతం ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపినప్పటికీ, పరిశీలకులుగా ఉన్న నాయకులంతా రేవంత్‌రెడ్డివైపే మొగ్గు చూపినా, అధిష్ఠానం సైతం రేవంత్‌కు ఓకే చెప్పినా.. ఆరేడుమంది నాయకులు రేవంత్‌ను వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో డీకే శివకుమార్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు.
తొలుత సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ఖరారు చేశారు. ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా సాయంత్రం 7 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు తమ పూర్తి స్థాయి అభ్యంతరం చెప్పకపోయినప్పటికీ, రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇచ్చే పక్షంలో తమను సంతృప్తి పరిచేలా పదవులు వుండాలని పట్టుబట్టారు. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే, ఒకే ఒక డిప్యూటీ సీఎం పదవిని సృష్టించి, అది తనకు ఇవ్వాలని, అలాగే కీలకమైన మంత్రిత్వ శాఖ అప్పగించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే, తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలే కాంగ్రెస్ విజయంలో సింహభాగమైనందున, సీఎం పదవి ఈ రెండు జిల్లాలకే ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్ చేశారు. జానారెడ్డి తన కుమారునికి ఐటీ శాఖ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. అలాగే తనకు మంత్రివర్గంలో కాకపోయినా… కీలక పదవి ఇచ్చేలా చూడాలని ప్యాకేజీని ముందుకు తీసుకువచ్చారు. శ్రీధర్‌బాబు డిప్యూటీ సీఎం పదవిని ఆశించినట్లు తెలిసింది. లేకుంటే హోంశాఖను అప్పగించాలని అడిగినట్లు సమాచారం. వీరుకాకుండా, ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. అయితే అధిష్ఠానం మాత్రం తెలంగాణలో గెలుపునకు రేవంత్‌రెడ్డి ఒక్కడే కారణమని నమ్ముతోంది. అందుకే ఆయనకు సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్‌లో చేర్పులు మార్పులు సహజమే కాబట్టి, ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే. (Story: తెలంగాణ కాంగ్రెస్‌లో కుర్చీలాట!)
See Also: