బీఆర్ఎస్‌పై కత్తి కడతారా?
తెలంగాణ ఉద్యమం కోసం చావుదాక వెళ్లి తెలంగాణను తెచ్చానని తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానని, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, నీళ్లు, నిధులు, నియామకాలతో గత పదేళ్ల కాలం రాజభోగాలను అనుభవిస్తూ నిన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజల నుంచి తిరస్కరణకు గురైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ కక్షతీర్చుకుంటుందా? అన్న ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ కుటుంబం ఇంకో రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా కోల్పోతామని తెలిసి తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని కేసీఆర్ బలిదేవతగా అభివర్ణిస్తూ వచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం వైఎస్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి తన మాట వినలేదని ఏకంగా పదహారు నెలలు ఊచలు లెక్కపెట్టించిన ఘనత సోనియా గాంధీ, కాంగ్రెస్‌కు ఉంది. అలాంటి సోనియా గాంధీ కేసీఆర్ ను అంత ఈజీగా వదులుతారా? ఈ దేశంలో తనను నాయకుడిగా చేస్తే ప్రతిపక్షాల పార్టీల అన్ని పార్లమెంట్ స్థానాలకు తానే ఫండింగ్ చేస్తానన్న కేసీఆర్ ఆడియో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతోమంది అమరులైన తెలంగాణ గడ్డపై కేసీఆర్ తిరుగులేని అవినీతికి పాల్పడ్డాడన్న పూర్తి సమాచారం కాంగ్రెస్ అధిష్టానంలో లేకపోలేదు. తామిచ్చిన తెలంగాణ గడ్డపై వేల కోట్ల అవినీతికి పాల్పడి ఈ దేశంలో తమ స్థానంలోకి రావాలనుకున్న కేసీఆర్ ను నిజంగా తొక్కుతారా? అన్న వాదనను రాజకీయ సర్కిల్ లో మొదలైంది. అంతేకాకుండా బీఆర్ఎస్ మొదటినుంచి బిజెపితో అంటకాగడం కూడా ఒకింత కాంగ్రెస్ అధిష్టాన వర్గం గుర్రుగా ఉంది.
ఈ దేశంలో కాంగ్రెస్ ఒకే నిర్ణయాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటూ వస్తుంది. ఉత్తరాన, దక్షిణాదిన ఎన్ని పార్టీలు వచ్చినా దేశంలో అధికారంలో నైనా, ప్రతిపక్షంలోనైనా తామే ఉండాలన్న సంకల్పమే వారిది. గత పదేళ్లుగా బిజెపి అధికారంలో ఉంటూ వస్తోంది. ఇప్పుడిప్పుడే దక్షిణాదిన బిజెపి కనుమరుగవవుతూ వస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిన పూర్తి మెజారిటీ వచ్చి.. ఉత్తరాదిన కొన్ని మిత్రపక్షాలతో రంగంలో ఉంటే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అనడంలో సందేహంలేదు. అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగింది. ఈ నేపథ్యంలోనే అది సత్యమో అసత్యమో కానీ కేసీఆర్ ఆడియో గురించి ఇండియాటుడే అగ్రజర్నలిస్టు వ్యాఖ్యానించడం బిజెపి, కాంగ్రెస్ అగ్రనాయకుల్లో ఒక క్వశ్చన్ మార్కుగా నిలబడిఉంది. కేసీఆర్ ఎప్పుడైనా తమ దగ్గరికి వస్తాడన్న భరోసా బిజెపికి ఉండగా దేశ ప్రతిపక్ష స్థానంలోకి కేసీఆర్ వస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచన కాంగ్రెస్ లో ఉండేది. సరిగ్గా తెలంగాణ సాధారణ ఎన్నికలలో తమ దగ్గరున్న ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది. ఇక ఎక్కడో కేసీఆర్ నెలకొల్పిన ఒక రకమైన వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం లేదని అధికారంలో ఉన్న తెలంగాణ గడ్డపైనే కేసీఆర్ అవినీతిని బట్టబయలుచేసి ఊచలు లెక్కిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో జరిగిన ప్రతి బహిరంగ సభలో రాహుల్ గాంధీ కేసీఆర్ అవినీతిని కక్కిస్తానని ఢంకా భాజాయించి చెప్పారు. ఇదే జరగకపోతే అందరిలా రాహుల్ గాంధీ మాట్లాడిపోయారని అనుకుంటారనడంలో ఎలాంటి సందేహంలేదు.
తెలంగాణలో జరిగిన అవినీతిపై బిజెపి దగ్గర స్పష్టమైన అధారాలున్నాయి. భారత ప్రధాన మంత్రి, హోంమంత్రి, మోడీ, అమిత్ షాలు కూడా ప్రతీ బహిరంగ సభలో కేసీఆర్ అవినీతి గురించి పుంఖాను పుంఖాలుగా చెప్పారు. ఇదే రాజకీయ లోపాయికారితనం అంటే. ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవినీతికి పాల్పడితే కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి సంస్థలతో దర్యాప్తుకు ఆదేశిస్తాయి. ఒకవేళ రాజకీయ కక్ష అనుకుంటే ఆ రాష్ట్రంలోని తమ పార్టీ నేతలతో ఆ రాష్ట్ర న్యాయస్థానంలోనే ప్రజా పిల్‌ను వేయించుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలకు రిఫర్ చేయించుకుంటాయి. కానీ, ఇక్కడ పదేళ్ల కాలంలో రాజ్యసభ, లోక్ సభల్లో ప్రతీ బిల్లుకు బీఆర్ఎస్ సభ్యుల సహకారాన్ని తీసుకున్న బిజెపి.. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడం విస్మయాన్ని కలిగిస్తుంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో బిజెపిని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించి సింగిల్ డిజిట్‌కు పరిమితి చేసిన విషయం మొన్నటి ఎన్నికలే సాక్ష్యం. కాంగ్రెస్ అధిష్టానం దృష్టంతా ఇప్పుడు కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, కేసీఆర్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, కేసీఆర్ పాలనలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లను కేసీఆర్ కోవర్టుల అవినీతిపై ఢిల్లీనుంచే ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి మానిటరింగ్‌కు దిగినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో కేసీఆర్ తరువాత అగ్రసీవ్‌గా మాట్లాడే నేత రేవంత్ రెడ్డి. అందుకే రేవంత్‌రెడ్డిని ఎలాగైనా రాజకీయంగా అణగదొక్కాలని గత పదేళ్ల కాలంలో రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేయని ప్రయోగంలేదు. ఓటుకునోటు కేసులో రేవంత్‌ను జైలుకు పంపి చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమికొట్టారు. ఈ పదేళ్ల కాలంలో చంద్రబాబు కూడా కేసీఆర్‌ను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు తప్ప.. అవకాశం వస్తే కేసీఆర్ ను చంద్రబాబు ఆడుకునేవారు. 2018లో చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టినా అధికారంలోకి రాలేకపోయారు. ఇప్పుడు తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డితో కేసీఆర్ పై తనకు జరిగిన అవమానం, మానసిక వ్యధ తీర్చుకుంటాడనడంలో ఎలాంటి సందేహంలేదు. 2018 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ జగన్ కు సంపూర్ణ సహకారాలు అందించారన్న ఆరోపణలు లేకపోలేదు. రేవంత్ రెడ్డి లాంటి మాస్ లీడర్ ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా దశాబ్ద కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం నిజంగా అదృష్టంగా చెప్పొచ్చు.
బీఆర్ఎస్ నిలబడుతుందా?
తెలంగాణలో బిజెపి ఇక ఎప్పుడూ మరెప్పుడూ అధికారంలోకి రాలేదు. ఇక ఏ మాత్రం అవకాశం ఉన్నా బిఆర్ఎస్‌కే అవకాశాలుంటాయి. ఎందుకంటే వారికి సంఖ్యాబలం, అర్థికబలం ఉంది కాబట్టి. ప్రజల్లో బీఆర్ఎస్ గట్టిగా నిలబడే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు కూడా కేవలం ఐదుగురు ఎమ్మెల్యేల సంఖ్యాబలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఐదుగురు అటూఇటూ అయినా ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్తుంది. అందకే గతంలో చంద్రబాబు కేసీఆర్ లాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాక్కోవడం తప్ప మరో మార్గంలేదు. నియోజకవర్గం అభివృద్ధి పేరుతో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ వైపునకు మొగ్గుచూపుతున్నారు. నిన్నటికే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సిన రేవంత్‌రెడ్డిని నిలువరించేందుకు కేసీఆర్ కాంగ్రెస్‌లోని కొందరు నేతలను అడ్డుగించినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. రేవంత్ రెడ్డి సీఎం అయితే అటు ఆంధ్రాలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇద్దరూ శత్రువులైతే తన రాజకీయ ఉనికే కాదు వ్యక్తిగతంగా దెబ్బతీస్తారన్న ఆందోళనల్లో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం మొదలవుతుంది. తెలంగాణలో జరిగిన అవినీతి బయటికి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాలి.. (Story: కేసీఆర్ పై కక్షతీర్చుకుంటారా?)
- బి.రామారావు, సీనియర్ జర్నలిస్టు 9030715343
గమనిక 1 : ఈ కథనం రచయిత అభిప్రాయం మాత్రమే. రచయిత అభిప్రాయాలకు, న్యూస్ తెలుగు డాట్ నెట్ వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు. న్యూస్ తెలుగు కేవలం ప్రచురణకు ఒక వేదిక మాత్రమే. గమనించగలరు.
గమనిక 2 : న్యూస్ తెలుగు డాట్ నెట్ వెబ్‌సైట్ మనందరిదీ. ఆసక్తికరమైన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సినిమా, క్రీడ, వైద్య, విద్యఆరోగ్య, సాహితీ కథనాలను ఎవరైనా రాసి పంపించవచ్చు. మీ కథనాలను 7997014006 వాట్సాప్ నెంబరుకు లేదా mediafiles006@gmail.com ఈమెయిల్‌కు పంపించవచ్చు.
See Also :
తెలంగాణ కాంగ్రెస్‌లో కుర్చీలాట!