అనుమతి లేని వెంచర్లను తొలగిస్తాము
కమిషనర్
న్యూస్తెలుగు/గుంటూరుః గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసే వెంచర్లు లేదా లే అవుట్స్ ని తొలగిస్తామని, ప్రజలు కూడా అనుమతి పొందిన వెంచర్లలలోనే స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్ లో సమస్యలు రాకుండా ఉంటాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పరిధిలోని నల్లపాడు రోడ్ లోని ఆదర్శ నగర్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేట్ వెంచర్ హద్దు రాళ్లు, మార్కింగ్, రోడ్లను పట్టణ ప్రణాలికాధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా అనధికార లే అవుట్ ఉండడానికి వీలులేదని, ప్రభుత్వ నిర్దేశిత చెక్ లిస్ట్ మేరకు దరఖాస్తు చేసే లే అవుట్స్ కి వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా తాము వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసే ముందు సదరు వెంచర్ అనుమతులను పరిశీలించుకోవాలని, లేకుంటే రానున్న కాలంలో సమస్యలు వస్తాయని తెలిపారు. అనధికార లే అవుట్స్ ని తొలగించడానికి సచివాలయాల వారిగా పట్టణ ప్రణాళికాధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారన్నారు. అనధికార లే అవుట్స్ తొలగించడం, నిర్వాహకుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెంచర్ల నిర్వాహకులు కూడా జిఎంసి నుండి అనుమతుల మంజూరు సులభతరం చేసినందున అనధికార లే అవుట్స్ ఏర్పాటు చేసి సమస్యలకు గురికావద్దని హితవు పలికారు. పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించిన వెంచర్ల యజమానులకు వెంటనే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిపిలు అజయ్ కుమార్, టిపిఎస్ సువర్ణ కుమార్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు. (Story : అనుమతి లేని వెంచర్లను తొలగిస్తాము )