రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను వెంటనే అందజేయాలి
భవన నిర్మాణ కార్మికులు తాపీ వర్కర్స్ యూనియన్ వినుకొండ
న్యూస్‌తెలుగు/వినుకొండ : పేద ప్రజలు తమ స్వంత గృహాల నిర్మాణాల కొరకు ఇసుకను ఎక్కువ డబ్బు పెట్టి కొనవలసి వస్తుందని, ప్రభుత్వం చెప్పినట్లుగా ఉచిత ఇసుక దొరకడం లేదని, ప్రభుత్వమే క్వారీలను నిర్వహించి ఉచిత ఇసుకను ప్రజలకు సరఫరా చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణ గృహనిర్మాణదారులు మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లే మెట్ట ప్రాంతంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం ఉచిత ఇసుకను వెంటనే సరఫరా చేయాలని నిర్మాణదారులు పేద ప్రజలు ఇసుకను ఎక్కువ రేటు పెట్టి కొనవలసి వస్తున్నందున గృహాల నిర్మాణాలు తగ్గిపోయాయని దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోతున్నాయని ఆయన విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వంలో ఇసుక విషయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పాలయ్యారని వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు మాసాలు ఇసుకపై బ్యాన్ విధించారని, ఆరు మాసాలలో రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కూలి పనులు దొరకక కుటుంబాలు గడవక అల్లాడిపోయారని, భవన నిర్మాణ కార్మికులు అనేక ఉద్యమాలు చేసిన నేపద్యంలో అరకొరగా ఇసుకను కొనుగోలు చేసే విధంగా గత ప్రభుత్వ చేసిన నిర్ణయాల వల్ల కార్మికులు, నిర్మాణదారులు ఇసుకను ఎక్కువ రేట్లు పెట్టి కొనలేక గృహాలు నిర్మించుకోలేక ఇబ్బందుల పాలయ్యారని, కార్మికులు కూలీ దొరకక అల్లాడిపోయారని, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను సరఫరా చేస్తామని చెప్పారని, ఇటీవల ఉచిత ఇసుక అమలు చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినప్పటికిని ఇంతవరకు ప్రజలకు ఉచిత ఇసుక అందడం లేదని, దాని ఫలితంగా నిర్మాణదారులకు ఇసుక కొనటం చాలా కష్టతరమైందని, కావున ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ మే క్వారీలను నిర్వహించి ప్రజలకు ఉచిత ఇసుకను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, ఏఐటియుసి నాయకులు కొండముట్ల షేక్ చిన్న, సుభాని, మాజీ కార్యదర్శి శ్రీను, వెంకటేశ్వర్లు, కరిముల్లా, షేక్ సైదా, మల్లికార్జున రావు, రమణమ్మ, పద్మావతి, తదితరులు కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. (Story : రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను వెంటనే అందజేయాలి)