వైద్య అధికారులతో సమీక్షా సమావేశం
అయోడిన్ ఉప్పు వల్ల ఆరోగ్యం ఉల్లాసం
డియంహెచ్ఓ. అప్పయ్య
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) :
తెలంగాణ ప్రభుత్వ కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆదేశానుసారం గా,రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వివిధ స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను ప్రజలకు అందించుటకు చేస్తున్న ప్రయత్నంలోని భాగంగా సోమవారం ములుగు జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. అప్పయ్య ఆధ్వర్యంలో క్లినికల్ హెచ్వోడీస్ (జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, పీడియాట్రిక్ ,ఆర్థోపెడిక్ ,ఈ. ఎన్ .టి,) మున్నగువారితో కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య అధికారి అల్లెం అప్పయ్య తెలిపారు. ఈ సందర్బంగా అప్పయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వారంలో మూడు రోజులు సోమ ,మంగళ ,గురు వారాలలో అందుబాటులో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు ఇవ్వడం కొరకు, ప్రణాళిక తయారు చేయడం జరిగిందని,తదుపరి ప్రభుత్వ ఆదేశాలు అందిన తర్వాత పూర్తి కార్యాచరణను అమలు చేయడం జరుగుతుందని సమీక్షా సమావేశంలో తెలిపారు.
“ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవం కార్యక్రమం” నిర్వహించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ అయోడిన్ ఉప్పు వల్ల లాభాలను వివరిస్తూ, మంచి శారీరక మానసిక ఆరోగ్యం పెంపొందుతదని, సరైన పెరుగుదల ఉంటుందని, పిల్లలు చురుకుతనం, మంచి జ్ఞాపకశక్తి ,చదువు వయసుకు తగ్గ ప్రతిభను చూపుతారని వివరించారు. అలాగే అయోడిన్ లోపం వల్ల గర్భస్రావం, మృత శిశువు జననం, గొంతు వాపు ,అతి తక్కువ బరువుతో పుట్టే శిశువులు, మరుగుజ్జుతనం, బుద్ధి మాంద్యం మొదలగునవి పిల్లలలో గమనిస్తామని వివరించారు .ఈ అయోడిన్ ఉప్పు రుగ్మతల వల్ల కలిగే లాభనష్టాలను ప్రజలలో అవగాహన కార్యక్రమాల ద్వారా అయోడిన్ ఉప్పును ఉపయోగించేటట్లు చేయవచ్చునని డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీష్ ,జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ బిక్షపతి రావు, చంద్రశేఖర్ ,ఆర్థోపెడిక్ డాక్టర్ ప్రకాష్ ,పీడియాట్రిషన్ డాక్టర్ సుధాకర్ ,జనరల్ సర్జన్ డాక్టర్ వినయ్ బాబు, గైనిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి, జిల్లా అసంక్రమిక వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ పవన్ కుమార్ పాల్గొన్నారు. (Story : వైద్య అధికారులతో సమీక్షా సమావేశం)