నాణేల కొరత నివారణకు నాణేల పంపిణీ మేళా
కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ జీఎన్‌బీ.ఆనంద్‌కుమార్
న్యూస్ తెలుగు/విజయవాడ : ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మార్కెట్‌లో తక్కువ విలువైన రూపాయి నాణేల కొరత నివారణకు నాణేల పంపిణీ మేళా నిర్వహిస్తున్నట్లు కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ జీఎన్‌బీ.ఆనంద్‌కుమార్ తెలిపారు. రిజనర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు నాణాల కొరత నివారణకు వన్‌టౌన్ సామారంగ్ చౌక్‌లోని కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం నాణేల పంపిణీ మేళా ఘనంగా నిర్వహించారు. వన్‌టౌన్ కెనరా బ్యాంక్ విజయవాడ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఏ.మహేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా పది రూపాయిల నాణాలపై నెలకొన్న అపోహలను తొలిగించటంతో పాటు తక్కువ విలువైన నాణాల కొరతను నివారించేందుకు ఈ నెల 14, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నాణాల పంపిణీ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.10 నాణేలు చట్టబద్ధమైన చెలామణీని అందిస్తాయని, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. రూ.10 నాణేలు చట్టబద్ధంగా అన్ని లావాదేవీలకు ఉపయోగపడతాయని, అవి పూర్తిగా చెల్లుబాటు అయ్యే నాణేలు కాబట్టి, వ్యాపారాలు, వ్యక్తులు వాటిని నిరాకరించకూడదని తెలిపారు, బ్యాంకు సేవలలో పారదర్శకత, సౌలభ్యం, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యమని ఈ మేళా ద్వారా ప్రజలకు తక్కువ విలువ గల నాణేల కొరతను తీరుస్తున్నట్లు తెలిపారు. కెనరా బ్యాంక్ సేవలను మరింత విస్తరించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు త్వరలో మరిన్ని చోట్ల నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 66 బ్రాంచీల్లో రెండు రోజుల పాటు ఈ మేళా నిర్వహించి ప్రజలకు, వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మహేంద్రబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రజలకు తక్కువ విలువైన నాణేల కొరతను నివారించడం, విరివిగా నాణేల వినియోగంపై అవగాహన కల్పించడమేనని తెలిపారు. మేళాలో బ్యాంక్ ప్రతినిధులు వివిధ ధాతు నాణేలు రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు తమ చిన్నచిన్న లావాదేవీలకు అవసరమైన నాణేల సమస్యను పరిష్కరించున్నారు. నాణేల కొరత ఉన్న బ్యాంకు ఖాతాదారులు, స్థానిక వ్యాపారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ బీ.వరప్రసాద్, బ్రాంచ్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : నాణేల కొరత నివారణకు నాణేల పంపిణీ మేళా)