ప్రశాంతంగా పోలింగ్!
స్వల్ప ఘటనల ఫిర్యాదులపై తక్షణ చర్యలు
విజయవాడలోని 55వ వార్డులో రెండున్నర గంటల పాటు పోలింగ్ గడువు పొడిగింపు
12 జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
ఫిర్యాదులపై విచారణ.. ఆధారాలుంటే ఎఫ్ఐఆర్లు, నిందితుల అరెస్టులు
అమరావతిః రాష్ట్రంలో ఆదివారం జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మెజారిటీ ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున, ఐజీ రాజకుమారి లతో
కలిసి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, డీఐజీలు, ఎన్నికల పరిశీలకులతో ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులు, వినతులు అందాయని తెలిపారు. ఆయా ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
12 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష
పోలింగ్ సరళి, ఫిర్యాదులు, హింసాత్మక ఘటనలపై నంద్యాల, కడప, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో సుమారు 45 నిమిషాల పాటు మాట్లాడినట్లు కమిషనర్ తెలిపారు.
మెజారిటీ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్లు నివేదించారని, కొన్ని జిల్లాల్లో స్వల్ప స్థాయిలో ఫిర్యాదులు అందినట్లు వివరించారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో ఎలాంటి ఫిర్యాదులు, హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
విజయవాడ 55వ వార్డులో పోలింగ్ గడువు పొడిగింపు
విజయవాడలోని 55 వ వార్డులో సాంకేతిక, ఇతర కారణాలతో సుమారు రెండున్నర గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో, ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు పోలింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పొడిగించినట్లు అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.
జిల్లా కలెక్టర్ చేసిన అభ్యర్థనను పరిశీలించి, ఎన్నికల కమిషన్కు ఉన్న అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైన కారణంగా ఓటర్లు నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు వివరించారు.
ఫిర్యాదులపై నివేదికల ఆధారంగా చర్యలు
పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ఘటనలు జరిగినట్లు జిల్లా కలెక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని కమిషనర్ తెలిపారు. పోలింగ్ పూర్తయిన అనంతరం అందే ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీవో) నివేదికలు, ఇతర ఆధారాలను పరిశీలించి, ఫిర్యాదుల్లో వాస్తవాలు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
విజయవాడలోని 55వ వార్డులో పోలింగ్ సమయాన్ని పొడిగించిన అంశం మినహా, మిగిలిన ప్రాంతాల నుంచి పెద్దగా సమస్యలు నివేదించబడలేదని తెలిపారు.
3 గంటల వరకు 48.03 శాతం పోలింగ్ నమోదు
మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 48.03 శాతం పోలింగ్ నమోదైనట్లు కమిషనర్ వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో రిసెప్షన్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు.
పోలింగ్ స్టేషన్ వారీగా నమోదైన ఓట్ల వివరాలను పరిశీలించి, మొత్తం ఓటింగ్ శాతాన్ని లెక్కిస్తారని చెప్పారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రాథమిక అంచనా మాత్రమేనని, రిసెప్షన్ కేంద్రాల నుంచి పూర్తి వివరాలు అందిన అనంతరం సోమవారం నాటికి కచ్చితమైన పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఐజీ రాజకుమారి మాట్లాడుతూ.. ఆదివారం జరిగిన పోలింగ్ సందర్భంగా సుమారు 40 ఘటనలు నమోదైనట్లు, 275 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, నేరపూరిత అంశాలు ఉన్నట్లు గుర్తించిన కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై విచారణ చేపట్టామని, తదుపరి దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్టులు కూడా చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ప్రతి ఘటనను నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. (Story: ప్రశాంతంగా పోలింగ్!)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!
