నకిలీ మద్యం దందా బంద్ అయితే జగన్ దుకాణం క్లోజ్
న్యూస్ తెలుగు/వినుకొండ : వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి ఆదాయం తెచ్చిపెట్టే నకిలీ మద్యం బట్టీలు మూసుకుపోతున్నాయనే భయం పట్టుకుందని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఎక్కడైనా నేరం జరిగి నిందితులను పట్టుకుంటే అభినందించాల్సింది పోయి వారిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం ఏరులైపారినా పట్టించుకోలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అందుకే జగన్ గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అందుకే నేరస్తుల తరఫున మాట్లాడుతున్నారు. నకిలీ మద్యం వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్న జోగి రమేష్ లాంటి వ్యక్తిని ఇంకా పార్టీలో ఉంచుకొని మీడియా ముందు చిలకపలుకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఈ మేరకు చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తనకు సంబంధమే లేని గూగుల్ డేటా సెంటర్ తన శక్తియుక్తులతో వచ్చిందని సిగ్గులేకుండా చెప్పుకుంటున్న జగన్, నకిలీ మద్యం దందాను తెలివిగా తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డికి గతాన్ని మర్చిపోయే వ్యాధి ఏమైనా ఉండొచ్చేమో కానీ ప్రజలకు లేదని.. వారికి అన్నీ గుర్తుంటాయన్నారు. గతంలో నకలీ మద్యంపై పోరాడిన తమపై కేసులు పెట్టిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిది. వందల మంది ప్రాణాలు పోతున్నాయని టీడీపీ గళమెత్తినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి దందా బయటపడుతుంది. తన పార్టీకి ఇంధనంగా ఉన్న నకిలీ మద్యం దందా ఎక్కడ ఆగిపోతుందో అన్న భయంతో జగన్ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తాను చేసిన అవినీతి, అక్రమాలను, పాపాలను ఎదుటి వారిపై నెట్టడంలో జగన్ అండ్ కో పీహెచ్డీ చేశారని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ తన శక్తియుక్తులతో వచ్చిందని జగన్ సిగ్గులేకుండా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి డేటా సెంటర్ నువ్వు తెచ్చావా ? నువ్వు ఒప్పందం చేశావా? శంకుస్థాపన చేశావా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు చేసిన పనిని ఒక చేతకాని వాడిలాగా నేనే చేశానని జగన్ రెడ్డి ఎలా చెప్పుకోగలుగుతున్నారని ఎద్దేవా చేశారు.(Story : నకిలీ మద్యం దందా బంద్ అయితే జగన్ దుకాణం క్లోజ్ )

