నవ సమాజ స్థాపనతోనే గుర్రం జాషువాకు అసలైన నివాళి
నవయుగ కవిచక్రవర్తి ఆశయ సాధనకు యువత కదలాలి
గుర్రం జాషువా జయంతి సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నివాళులు
న్యూస్ తెలుగు /వినుకొండ : జీవిత ఆసాంతం గుర్రం జాషువా కలలు కన్న, అలుపెరగని పోరాటం చేసిన నవ సమాజ స్థాపన తోనే ఆయన అసలైన నివాళి అని వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. యావత్ రాష్ట్రం, దేశం గర్వించే అలాంటి కవికోకిలా వినుకొండ ప్రాంతానికి చెందిన వారు కావడం అందరి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కవిగా, సామాజిక ఉద్యమకారుడిగా, ఎమ్మెల్సీగా, పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా ఈ ప్రాంతానికి ఆయన అనితర సాధ్యమైన గుర్తింపును తీసుకు వచ్చారంటూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. గుర్రం జాషువా 130 జయంతి సందర్భంగా ఆదివారం మున్సిపల్ ఆఫీసు జాషువా కళా ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కవితల ద్వారా సమాజంలో గొప్ప మార్పు కోసం పునాది వేసిన అభ్యుదయవాది గుర్రం జాషువా, నమ్మిన బాటలో నిర్విరామంగా కృషి చేశారని కొనియాడు. సమాజంలోని అసమానతలపై పోరాడిన జాషువా బాటలోనే యువత ఆయన ఆశయ సాధన కోసం యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అందరు కలసికట్టు గా కృషి చేస్తే ఆయన ఆశయాలు సాధించి తీరుతామన్నారు. గుర్రం జాషువా గుర్తుగా స్థానిక ఎన్నెస్పీ మైదానంలో ఆధునిక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, ఒక పెద్ద అంబేద్కర్ భవన్ కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.(Story:నవ సమాజ స్థాపనతోనే గుర్రం జాషువాకు అసలైన నివాళి)

