ముస్లిం విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక సహాయం
బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ, పల్నాడు ప్రాంతంలోని విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక సహాయం అందించేందు కు సదాసిద్ధంగా ఉంటానని ప్రభుత్వ చీఫ్‌విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రకటించారు. చదువుకుంటున్న ముస్లిం పిల్లలను ప్రోత్సహించేలా ఉపకారవేతనాలు పంపిణీ చేపట్టాలని కోరుతున్నానని, అందులో తనవంతు కూడా భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ తెలుపుతుందన్నారు. అదే స్ఫూర్తితో ఏటా ముస్లింలు ప్రతి మసీదు నుంచి కొంత డబ్బు వసూలు చేస్తే తాను రానున్న పదేళ్లు 25% ఇస్తానని, ఎంత సేకరిస్తే అందులో 25% ఇస్తానన్నారు. త్యాగానికి, బలిదానానికి గుర్తుగా నిర్వహించే బక్రీద్ వేడుకలు వినుకొండ లో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. తిమ్మాయపాలెం రోడ్డులోని ఈద్గా మైదానంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈద్గా మైదానానికి తరలివచ్చిన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ సహనం, నిస్వార్థగుణం, దైవభక్తిని పెంపొందించే పండగ బక్రీద్ పర్వదిననవు, త్యాగానికి ప్రతీక అని, ఒకరికొకరు ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం పంచుకునే సందర్భమన్నారు. ఈద్గా అభివృద్ధికి రూ.40 లక్షలు మంజూరు చేయించామని, వచ్చే రంజాన్ నాటికి ఆ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వినుకొండ, పల్నాడుతో పాటు దేశవ్యాప్తంగా ముస్లింల్లో చదువుకున్న వారు చాలా తక్కువని, ఈ మధ్య చదువుకుంటున్న వారికి బ్రహ్మాండమైన మార్కులు వస్తున్నాయని, ఇంజినీర్లు, వైద్యులు అవుతున్నారని తెలిపారు. తన తండ్రి అప్పులు చేసి కష్టాల్లో చదివించారని, అందుకే ఆర్థిక ప్రగతిలో 4 అడుగులు ముందుకెళ్లాలని చెప్పారు. పేదరికాన్ని అధిగమించాలంటే చదువు చాలా అవసరమని, ముస్లింలు తమ పిల్లలను బాగా చదివించాలని కోరుతున్నట్లు చెప్పారు. పేద పిల్లలను చదివించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులను కోరుతున్నానని చెప్పారు. పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదరికంలో చదువుకుంటున్న పేద పిల్లలకు అండగా ఉండాలనేదే తన సంకల్పమన్న చీఫ్‌విప్ జీవీ చదువు కునే పిల్లల కోసం రూ.10 వేలు, రూ.5 వేలు ఖర్చు చేసేవారు ముందుకు రావాలని, ఒక్కొక్కరు ఒక్కో విద్యార్థిని చదివించినా ఎంతోమందిని చదివించవచ్చని తెలిపారు. ముస్లింలు ఆర్థిక ప్రగతి సాధించాలని, చదువులో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.(Story : ముస్లిం విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక సహాయం )

