నిరంతరాయంగా ఉచిత కంటి వైద్యశిబిరాల నిర్వహణ
శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
కళ్లజోళ్లు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ, డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత కంటి వైద్యశిబిరాల నిర్వహణను దేవుడు తమకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామని, ఈ మంచి కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ఎంతోమందికి తిరిగి కంటి చూపును ఇవ్వడం, చూపు మెరుగు పరచడం తమ ద్వారా జరగుతుండడం ఎంతో సంతృప్తిని ఇస్తోన్న విషయం అన్నారు. వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. శంకర కంటి ఆస్పత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఇటీవల కంటి శుక్లాల శస్త్రచికిత్స చేయించుకున్న వారికి చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు కంటి శుక్లాలు తీయించుకోవడానికి ముందు తర్వాత ఎలా ఉందని అడిగితే మళ్లీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు ఉందని, కళ్లు బాగా కనబడుతున్నాయని చెబుతున్నారని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. శంకర కంటి ఆస్పత్రి యాజమాన్య సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇంతమందికి కంటి ఆపరేషన్లు చేయించినందుకు తనకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని, ఇంతమందికి కంటి ఆపరేషన్లు చేయించడం, సేవ చేయడానికి ఆ పరమేశ్వరుడు తనకు ఇచ్చిన మహాభాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న తరుణంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఫింఛన్లు ఇస్తామని హామీఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో రానివారికి కూడా త్వరలో పింఛన్లు అందిస్తామన్నారు. కొత్త పింఛన్లతో పాటు ఇళ్లు లేనివారికి స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.(Story : నిరంతరాయంగా ఉచిత కంటి వైద్యశిబిరాల నిర్వహణ)