కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 80 శాతం హామీల అమలు
ఏనుగుపాలెంలో ఇంటింటికీ కుళాయి పనులకు శంకుస్థాపన
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 80శాతం హామీలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎగ్గొట్టి, ఎన్నో పథకాల్ని ఆపేసిన వైకాపా ప్రభుత్వానికి, ఏడాదిలోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. వినుకొండ నియోజకవర్గం లోని ఏనుగుపాలెంలో జల్‌జీవన్ మిషన్ కింద రూ.71 లక్షల వ్యయంతో తాగునీటి ట్యాంక్, ఇంటింటికీ కుళాయి పథకానికి శనివారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావుతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 60 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న తాగునీటి ట్యాంక్ ద్వారా గ్రామంలో 450 ఇళ్లకు రక్షిత మంచినీరు సరఫరా చేయనున్నామన్నారు. మరో 350 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.25 లక్షలు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరానని, ఆ నిధులు సమకూర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఐదేళ్లుగా ఇదే జల్‌జీవన్ మిషన్ పనులు వైకాపా ఎందుకు చేయలేక పోయిందో చెప్పాల ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా నిలబెట్టుకోలేని అసమర్థ పాలన జగన్ దని ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.3 వేల పింఛన్‌ను 4 వేలు చేశామ ని, 65 లక్షలమందికి ఏటా రూ.31 వేల కోట్లు వ్యయంతో లబ్ది చేకూర్చుతున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,437 పోస్టులు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభిస్తామని, మరికొన్ని రోజుల్లోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నామని తెలిపారు. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, పాడి రైతుల కోసం రూ.2 లక్షల వ్యయంతో షెడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. గుత్తేదారులు నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడకుండా త్వరితగతిన జల్‌జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేదని, పిల్లలు చదువుకోవడానికి వెళ్లేందుకు బస్సులు రాని పరిస్థితి కూడా చూశామని, కూటమి ప్రభుత్వం రాగానే అంతటి గుంతలను కూడా పూడ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కిలోమీటర్ల మేర గుంతలను పూడ్చామని తెలిపారు. భవిష్యత్తులో ఏనుగుపాలెం రహదారిని రెండు లైన్లుగా విస్తరిస్తామని చెప్పారు.(Story : కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 80 శాతం హామీల అమలు)