23న జరిగే అక్షరాస్యతా పరీక్షకు ఏర్పాట్లు
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ప్రాధమిక అక్షరాస్యతా పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, వయోజన విద్య డిడి ఎ.సోమేశ్వర్రావు కోరారు. స్థానిక డిఆర్‌డిఏ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిడి సోమేశ్వర్రావు మాట్లాడుతూ, ఉల్లాస్-నవభారత సాక్షరతా కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ టెస్ట్ (ఎఫ్ఎల్ఎన్ఏటి) నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు మధ్య లబ్దిదారులు వారికి వీలైన సమయంలో 3 గంటల పాటు నిర్వహిస్తారని తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా, నిరక్షరాస్యులను ఎంపిక చేసి, వారికి స్వయం సహాక సంఘ సభ్యులచేత అక్షరాలను, చదవడం, రాయడం, లెక్కలను నేర్పించడం జరిగిందని, వారు ఏమాత్రం పురోగతి సాధించారో తెలుసుకొనేందుకు ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, లేదా వారికి అనువైన స్థలాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించి, జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ ద్వారా అధికారిక ధృవీకరణ పత్రాలను పొందాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ ఇన్‌ఛార్జి పిడి జి.ప్రసన్న, వయోజనవిద్య ఏఓ సిహెచ్ఆర్ సి ధనలక్ష్మి , సిడిపిఓలు, వెలుగు ఏపిఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.(Story :23న జరిగే అక్షరాస్యతా పరీక్షకు ఏర్పాట్లు)