పోలవరం ప్రాజెక్టు ఆలస్యంతో రైతులకు రూ.లక్ష కోట్ల నష్టం
సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు జగన్ నిర్లక్ష్యం, ఆ కారణంగా జరిగిన ఆలస్యంతో రైతులకు రూ.లక్ష కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో 73%పూర్తయిన ప్రాజెక్టుపై జగన్ కాలయాపనతో నిర్మాణఖర్చు కూడా భారీగా పెరిగిందని, విద్యుదుత్పత్తి అవకాశాలూ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నష్టాలు సరిచేసేలా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్న జీవీ తలపెట్టి న ప్రతి ప్రాజెక్టు పూర్తి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంగా పెట్టుకున్నారని తెలి పారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా బుధవారం ఈ మేరకు మాట్లాడారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రాజెక్టులపై రూ. 68వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ హయాంలో అది రూ. 35వేల కోట్లుగానే ఉందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో మొత్తం బడ్జెట్ రూ. 7లక్షల కోట్లు ఉంటే అందులో 10.3%ప్రాజెక్టుల మీదనే ఖర్చు పెడితే వైకాపా హయాంలో అది 2శాతం మించలేదన్నారు. ఇచ్చిన రూ.35వేల కోట్లలో రూ.10 కోట్లు జీతాలకే పోతే ఇక ప్రాజెక్టు గతేం కావాలని ప్రశ్నించారు. నిజానికి 2019లో తెలుగుదేశం ప్రభుత్వమే మళ్లీ వచ్చి ఉంటే 2020కల్లా పోలవరం పూర్తయి ఉండేదని.. ఒక్కఛాన్స్ పేరుతో వచ్చి ఓటేసిన పాపానికి ప్రజలకు జగన్ తీరని అన్యాయం చేశాడన్నారు. చంద్రబాబు రూ.1600 కోట్లతో పట్టిసీమ చేపట్టి రూ.40వేల కోట్లు దిగుబడులు సాధిస్తే… జగన్ ప్రాజెక్టుల కనీస నిర్వహ ణ పట్టించుకోలేదని తూర్పారాబట్టారు. 2014-19 మధ్య చంద్రబాబు 60 పైగా ప్రాజెక్టులు చేపట్టి 23ప్రాజెక్టులు పూర్తి చేసి 32లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారని, లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చారన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకే రూ.13వేల కోట్లు ఖర్చు చేశారని, అదే సీమ బిడ్డని అని చెప్పుకునే జగన్ మాత్రం కేవలం రూ.3వేల కోట్లే ఖర్చు చేశారని, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా సీమద్రోహిగా మిగిలారని రైతులే అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు రూ.2వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వంలో అది రూ.500 కోట్లు కూడా దాటలేదన్నారు. జగన్ నిర్లక్ష్యం కారణంగా పులిచింతల గేటు కొట్టుకు పోయిందని, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 2022లో, 2023 లో గుండ్లకమ్మ 2 గేట్లు కొట్టుకుపోయాయని గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే ప్రారంభించిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం, బనకచర్ల పూర్తితో రాయలసీమ కరవు తీరుతుందని.. పల్నాడు ప్రకాశం జిల్లాలు గోదావరి జలాలలో ఒక పంట, కృష్ణా జలాలో మరో పంట పండించుకోవచ్చన్నారు. బొల్లాపల్లితో పాటు వరికెపూడిశల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత సాగునీటిశాఖ మంత్రి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (Story :పోలవరం ప్రాజెక్టు ఆలస్యంతో రైతులకు రూ.లక్ష కోట్ల నష్టం)