అనుమానితుల నేర చరిత్రను ఫింగర్ ప్రింట్ డివైజ్ తో గుర్తింపు
వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణ పరిధిలో రాత్రి పెట్రోలింగ్, గస్తీ, వాహన తనిఖీల్లో అనుమానితుల నేర చరిత్రను గుర్తించేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో ఫింగర్ ప్రింట్ డివైజ్ లను వినియోగిస్తున్నామని వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు.
రాత్రి సమయాల్లో అనుమానస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల నేర చరిత్రను గుర్తించి, వారిపై చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కృషి ఫలితంగా ఫింగర్ ప్రింట్ డివైజ్ లు జిల్లాకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ డివైజ్ ను వినియోగించి అనుమానితుల వేలి ముద్రలను చెక్ చేస్తే, వారి నేర చరిత్ర క్షణాల్లో తెలిసిపోతుందన్నారు. ఈ డివైజ్ వినియోగించుట ద్వారా వ్యక్తుల నేర చరిత్రను గుర్తిస్తున్నామన్నారు. ఈ డివైజ్ వినియోగించి రాత్రి సమయాల్లో పట్టణంలో సంచరించే అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి, వారు పాత నేరస్తులా? ఏమైనా నేర చరిత్ర ఉందా? అన్న విషయాన్ని గుర్తించి, వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నామన్నారు. రాత్రి పెట్రోలింగ్, గస్తీ, వాహన తనిఖీల్లో వీటిని వినియోగిస్తున్నట్లుగా వన్ టౌన్ సిఐ తెలిపారు.వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రద్దీ ప్రాంతాలు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది ఫింగర్ ప్రింట్ డివైజ్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. (Story ; అనుమానితుల నేర చరిత్రను ఫింగర్ ప్రింట్ డివైజ్ తో గుర్తింపు)