ఇంజినీరింగ్ కాలేజీలపై నిఘా?
ప్రక్షాళనకు మంత్రి లోకేష్ సిద్ధం
కేఎల్‌యూపై సీబీఐ దాడులతో ప్రభుత్వ అప్రమత్తం
ప్రమాణాలు లేకుంటే వేటు
ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల వినతులకు చెక్
ఎన్‌ఆర్‌ఐ, ఆదిత్యపై ఫిర్యాదులు?
అరకొర సౌకర్యాలతో ఉన్నతీకరణకు వినతులు
త్వరలో ఏపీ ఈఏపీసెట్-2025 నోటిఫికేషన్
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ విద్యను మెరుగు పరిచేందుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలిసింది. బోధనా ప్రమాణాలులేని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలను గుర్తించి వాటికి చెక్‌పెట్టే దిశగా ఉన్నత విద్యామండలికి మంత్రి ఆదేశించినట్లు సమాచారం. తాజాగా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బందిపైన, న్యాక్ అధికారులపైన మూకుమ్మడిగా సీబీఐ దాడులు చేయడం దేశ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. గ్రేడ్‌లు, ర్యాంక్‌ల కోసం కేఎల్ యూనివర్సిటీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. సీబీఐ దాడులతో అక్కడ అవినీతి భాగోతం ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. విద్యకు ఎంతో పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా సీబీఐ దాడులు నెలకొనడం..రాష్ట్ర పరువు ప్రతిష్టలకు అవమానంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఉన్నత విద్యలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కేఎల్‌యూపై సీబీఐ దాడుల అనంతరం ఆ తరహాలో..న్యాక్ అధికారులను లోబరుచుకుని, వారికి ముడుపులు, కానుకలు కేటాయించి గ్రేడ్‌లు, ర్యాంకులు వేయించుకున్న మరికొన్ని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యంపై ప్రభుత్వం నిఘా ఉంచింది. రాష్ట్రంలోని జిల్లాల వారీగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు, విద్యాబోధన తీరును పరిశీలించాలంటూ మంత్రి లోకేష్‌కు ఇటీవల పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్ ఎం.రామకృష్ణ లేఖ రాశారు. ఏలూరుజిల్లా ఆగిరిపల్లిలోని ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్ కాలేజీతోపాటు అనేక ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో మౌలిక సౌకర్యాలు, విద్యా పరిస్థితిపై సమగ్ర దర్యాప్తు చేయాలని మంత్రి లోకేష్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లోనే సరైన బోధనా, సౌకర్యాలు లేకుండానే, వాటిని ప్రైవేట్ యూనివర్సిటీలుగాను, లేక డీమ్డ్ యూనివర్సిటీలుగాను ఉన్నతీకరించే చర్యలు సముచితం కాదంటూ మంత్రికి సూచించారు. ఆయా ఇంజినీరింగ్ కళాశాలలపై ఎలాంటి పరిశీలన లేకుండా, ఉన్నతాధికారుల మాటలు నమ్మి అనుమతులిస్తే..విద్యార్థులు బలిపశువులయ్యే ప్రమాదముంది. అనేక ఇంజినీరింగ్ కళాశాలల్లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం వారికి ఎక్కడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు రావడంలేదని, నిరుద్యోగులుగా అవతారమెత్తి బయట మార్కెట్‌లో తిరుగుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఫీజులు గట్టిగా వసూలు చేస్తూ, బోధన విషయంలో అరకొరగానే ప్రామాణికాలు పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాంటి ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన కొన్ని వివరాలను మంత్రికి విద్యార్థి సంఘాలు పంపినట్లుగా సమాచారం. దీని ఆధారంగా ఇంజినీరింగ్ కళాశాలల ప్రామాణికతపై మంత్రి లోకేష్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టినట్లు సమాచారం.
కాలేజీలకు తప్పుడు రేటింగ్‌లు
గుంటూరుజిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్(కేఎల్‌ఈఎఫ్) ‘ఏ++’ రేటింగ్ కోసం న్యాక్ పరిశీలన బృందానికి భారీగా ముడుపులు ఇచ్చిన కేసులో కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, ఫౌండేషన్ సభ్యులు, న్యాక్ బృంద అధికారులు జైలు పాలయ్యారు. ఈ సంఘటనపై సీబీఐ దాడులు చేసి, కేసు నమోదుతో వారంతా జైలు పాలయ్యారు. న్యాక్ బృందంలోని అధికారులు, కేఎల్ ఆఫీసు బేరర్లు సహా మొత్తం 10మందిని అరెస్టు చేసింది. తొలుత ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ తర్వాత రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. న్యాక్ బృందానికి బంగారు నాణేలు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ముడుపులుగా ఇచ్చినట్లు గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్‌పూర్, భోపాల్, బిలాసపూర్, గౌతం బుద్ధనగర్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు జరిపినట్లు సీబీఐ వివరించింది. ఈ సోదాల్లో రూ.37లక్షల నగదు, ఆరు ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. న్యాక్ పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహాతోపాటు కమిటీ సభ్యులనూ సీబీఐ అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. ఈ సంఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆందోళన చెందారు. ప్రభుత్వాలు మొదటి నుంచే ఈ తరహాగాచర్యలకు పాల్పడి ఉంటే..ఇంతవరకూ వచ్చేది కాదని సూచిస్తున్నారు. కేఎల్‌యూ తరహాలో మరికొన్ని ప్రైవేట్ యూనివర్శిటీలు, డీమ్డ్ వర్సిటీలు న్యాక్ బృందానికి ముడుపులు ఇచ్చి..రేటింగ్‌లు, గ్రేడ్‌లకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని, ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితిపై ఆరా తీసేందుకు సిద్ధమైంది.
ఇంజినీరింగ్ సీట్ల మిగులుపై దృష్టి
ప్రతి విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లు, అందుకుగల కారణాలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఏపీఈఏపీసెట్-2025 ద్వారా ఇంజినీరింగ్ సీట్లను భర్తీ చేశారు. మూడు విడతలుగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ, పూర్తి స్థాయిలో సీట్లు భర్తీకావడంలేదు. దానికితోడు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యంగా నిర్వహించడంతో విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. అక్కడ చదివిన వారికి మెరుగైన విద్య, క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ విద్యకు కేవలం మొక్కుబడిగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల్లోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు లభిస్తున్నాయి. ఏపీ ఈఏపీసెట్-2024 వెబ్ కౌన్సెలింగ్ నాటికి రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,65,579 సీట్లు, ప్రభుత్వ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో 5,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి భర్తీకి మూడు విడతలుగా వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ, పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీసెట్) నోటిఫికేషన్ విడుదల చేసి, ముందస్తుగా వెబ్ కౌన్సెలింగ్‌కు మంత్రి లోకేష్ చర్యలకు నిమగ్నమైనట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఎస్ ఈఏపీసెట్`2025 విడుదలైంది. దీంతో ఏపీ నుంచి కూడా ఏపీ ఈఏపీసెట్-2025 నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాబోయే నూనత విద్యా సంవత్సరంలో ప్రమాణాలు పాటించలేని కళాశాలల గుర్తింపు రద్దుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆ దిశగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కి జాబితాను సిద్ధం చేసి పంపాలని కసరత్తు చేస్తోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి ముందు ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. అక్కడి నుంచి అనుమతులు పొందాకనే, ఆయా కళాశాలల్లో ఇంజినీరింగ్ సీట్లను బ్రాంచీల వారీగా కేటాయిస్తారు. సరైన ప్రమాణాలు లేని ఇంజినీరింగ్ కళాశాలల సీట్లకు కోత విధించే అధికారం కలదు. దీని ఆధారంగా విద్యా ప్రమాణాలులేని ఇంజినీరింగ్ కళాశాలల జాబితాను కేంద్రానికి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. (Story: ఇంజినీరింగ్ కాలేజీలపై నిఘా?)
Follow the Stories:
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?