చంద్రబాబు కృషి, మోదీ సహకారంతోనే రాష్ట్రానికి నిధులు
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై హర్షం వ్యక్తం చేసిన చీఫ్ విప్ జీవీ…
న్యూస్ తెలుగు /వినుకొండ : ఎన్డీయే బంధం, సీఎం చంద్రబాబు కృషి, రాష్ట్రం పట్ల ప్రధాని మోదీ ప్రత్యేక ఆదరణ బడ్జెట్ కేటాయింపుల రూపంలో మరోసారి స్పష్టంగా కనిపించిందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో అన్నారు. కూటమిపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న అపారమైన నమ్మకం, అందించిన అఖండ విజయం కేంద్ర నుంచి నిధుల రూపంలో వరదగా తిరిగి వస్తోందన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గడిచిన బడ్జెట్‌లో, ఈ బడ్జెట్‌లో కూడా రాష్ట్రం పేరు పెట్టి మరీ ప్రత్యేక కేటాయింపులు ఇవ్వడం, ప్రాజెక్టుల వారీగా నిధులు ఇవ్వడం పట్ల కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు గతేడాది ఇచ్చిన రూ. 5,512 కోట్ల కంటే రూ.424 కోట్లు అదనంగా రూ.5936 కోట్లు ఇవ్వడం రాష్ట్ర జీవనాడి పూర్తిపై ఆశలు, నమ్మకాన్ని కలిగించిందన్నారు. ఎన్డీయే కొత్త ప్రభుత్వంలోనే పోలవరం తాజా డీపీఆర్ ఆమోదించారన్న జీవీ.. తద్వారా రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు వచ్చిన నిధుల్లో ఇవే అత్యధికం అన్న ఆయన ప్యాకేజీలో భాగంగా అడ్వాన్స్ కూడా ఇవ్వడంతో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అదే సమయంలో విశాఖకు ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ప్యాకేజీని అమల్లోకి తేవడం రాష్ట్రంలో, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాల చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. ఇటీవల ప్రకటించిన 11,917 కోట్లు ప్యాకేజీని నిజం చేస్తూ పాత బడ్జెట్‌లో కేటాయింపుల్ని 620 కోట్ల నుంచి 8వేల 622 కోట్లకు పెంచడం, కొత్త బడ్జెట్‌లో 3,295 కోట్లు కేటాయించడం సీఎం చంద్రబాబు, పీఎం మోదీ సంకల్పం కారణంగానే సాధ్యమైందన్నారు. బడ్జెట్‌లో కీలకంగా ప్రస్తావించిన జల్‌జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటీవలే అందుకు సంబంధించి రాష్ట్రం తరఫున రూ.70వేల కోట్లు కావాలని ప్రతిపాదనలు ఇచ్చిన నేపథ్యంలో సింహ భాగం మేలు జరిగే అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి ఎంపీలు ముందు నుంచి రంగాలు, శాఖల వారీగా శ్రద్ధ తీసుకుని ప్రయత్నాలు చేయడం కారణంగా గత బడ్జెట్ కేటాయింపుులు, ప్రకటల్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఆర్థికమంత్రి చెప్పడం కూడా రాష్ట్రానికి మంచి పరిణామంగా పేర్కొన్నారు. ఇవి కాకుండా మౌలిక సదుపాయల కల్పనకు కేంద్రం ప్రకటించిన రూ.1.5లక్షల కోట్ల ప్యాకేజీలో ఏపీకి మంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పరోక్షంగా అమరావతి, మెట్రో రైలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, వ్యవసాయం, విద్య రంగాల్లో భారీగా నిధుల రాకకు అవకాశం ఉందని… ఆ మార్గాల్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. (Story : చంద్రబాబు కృషి, మోదీ సహకారంతోనే రాష్ట్రానికి నిధులు)