ఉపాధి కూలీల మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్బ్రాంతి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ఫోన్
అన్ని విధాలా ఆదుకోవాలని కోరిన కేంద్ర మంత్రి
ఆర్ధిక సాయం, ఉద్యోగం ఇస్తామని వెల్లడించిన కలెక్టర్
న్యూస్ తెలుగు/సిద్దిపేట జిల్లా ప్రతినిధి: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు మీద పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో పాటు మరో ఐదుగురికి తీవ్ర గాయలవ్వడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళుతున్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరికి ఫోన్ చేసి ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు
మృతుల కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున సాయం అందిస్తామని, దీంతోపాటు మృతులు మహిళా పొదుపు సంఘాల్లో కొనసాగుతున్నందున మరో రూ.10 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీంతోపాటు ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులుంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు…
దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన బీజేపీ మండల శ్రేణులు…
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
గోవర్ధనగిరి గ్రామంలో మట్టిరోడ్లు మరమ్మతుల పనుల నేపథ్యంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీల మృతి పట్ల అక్కన్నపేట బీజేపీ మండలద్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాలపై మృతుల కుటుంబాలతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
( ప్రత్యేక కథనం: న్యూస్ తెలుగు సిద్దిపేట జిల్లా ప్రతినిధి – నారదాసు ఈశ్వర్