యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ జే రమేష్, విద్యార్థి సంఘం మాజీ నేత గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ 2025 నూతన క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని రెండు లక్షలఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 13 నెలలు దాటిన 53 వేల ఉద్యోగాలని భర్తీ చేసిందన్నారు. చదువుకునే యువతకు రూ. 5 లక్షల వరకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. జాబ్, స్కిల్స్, లోన్ మేళాలు నిర్వహించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మేళ నిర్వహించేందుకు వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డిసెంబర్ 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారన్నారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు పెడతామని చెప్పారని ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను జిల్లాలో ఏర్పాటు చేసి యువకులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలన్నారు. గతంలో నరేంద్ర మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారన్నారు. యువతకు పాలకులు ఆశ చూపి మోసం చేస్తున్నారని సరైన సమయంలో గుణపాఠం తప్పదు అన్నారు. యువత ఉద్యోగ ఉపాధి కోసం సమాజంలో మార్పు కోసం ఏఐవైఎఫ్ నిరంతరం పోరాడుతుందని యువకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. నేతలు పాల్గొన్నారు.(Story : యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి)