భద్రాచలం క్రికెట్ త్రిష వరల్డ్ రికార్డ్
– అండర్ 19 వరల్డ్ కప్ లో చెలరేగిన చిచ్చరపిడుగు
– 53 బంతుల్లో 110 పరుగులు
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం పట్టణానికి చెందిన గొంగటి త్రిష విశ్వ వేదికపై రికార్డ్ సృష్టించింది. చెలరేగిన ఆ చిచ్చరపిడుగు 53 బంతుల్లో 110 పరుగులు సాధించి వరల్డ్ రికార్డ్ సాధించింది. టి20 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరుగుతున్న మహిళ అండర్ 19 టి20 మ్యాచ్ మంగళవారం భారత్ – స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో త్రిష పరుగుల వర్షాన్ని కురిపించింది. వచ్చిన ప్రతి బంతిని ఎదుర్కొని బౌండరీ లైన్ దాటించింది. మొత్తం 53 బంతులు ఎదుర్కొన్న ఆమె 110 పరుగులు రాబట్టింది. ఇందులో 4 సిక్స్ లు, 13 ఫోర్లు ఉన్నాయి. భద్రాచలానికి చెందిన తెలుగు అమ్మాయి వరల్డ్ రికార్డ్ సాధించడంతో దేశ ప్రజలతో పాటు, ఆమె స్వగ్రామంలో హర్షాత్రేఖలు వ్యక్తం అవుతున్నాయి.
చిన్ననాటి నుండే క్రికెట్పై హక్కు పెంచుకున్న త్రిష తన తండ్రి రామిరెడ్డి వద్ద ఓనమాలు నేర్చుకుంది. స్కూల్ లెవెల్ నుండే క్రికెట్ పోటీల్లో పాల్గొంటూ చక్కటి ప్రతిభను కనపరుస్తుండటంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. అనంతరం హైదరాబాదులో కోచింగ్ ఇప్పించారు. అతిపిన్న వయసులోనే భారత మహిళా జట్టులో చోటును సంపాదించుకున్న త్రిష ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది. భవిష్యత్తులో ఈ తెలుగు అమ్మాయి భారత మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని పలువురాకాంక్షిస్తున్నారు.
త్రిష వరల్డ్ రికార్డ్ సాధించడం పట్ల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. క్రికెట్ అభిమానులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జయహో భారత్, త్రిష సూపర్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. (Story : భద్రాచలం క్రికెట్ త్రిష వరల్డ్ రికార్డ్)