పాత్రికేయుల స్థలం సమస్యకు తక్షణ పరిష్కారం
– ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా
– శాసనసభ సమావేశాల్లోనూ లేవనెత్తుతా
– ఆక్రమణలు వెంటనే తొలగింపజేస్తా
– ప్రభుత్వ విప్ యార్లగడ్డ భరోసా
న్యూస్‌తెలుగు/విజయవాడ : పాత్రికేయుల సహకార గృహ నిర్మాణ సంఘానికి ప్రభుత్వం స్థలం కేటాయించి 17 ఏళ్లు గడుస్తున్నా వారి సొంతింటి కల నేటికీ సాకారం కాకపోవడం బాధాకరమని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభమైన పాత్రికేయ సమాజానికే ఇలాంటి ఆవేదనకర పరిస్థితి ఎదురైతే, సామాన్యుల గతి ఏమిటని ప్రశ్నించారు. ‘ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం’ మహాజన సభ 26న ఆదివారం ఉదయం నున్న గ్రామంలోని జర్నలిస్టుల కాలనీ స్థలంలో జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన యార్లగడ్డ ప్రసంగిస్తూ.. ఈ దీర్ఘకాల సమస్య పరిష్కారానికి తాను బాధ్యతగా కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. ఈ స్థలంలో వెలసిన ఆక్రమణలను తక్షణం తొలగింపజేస్తామన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉదార స్వభావంతో వుంటారని చెబుతూ, మనమంతా కలిసి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళదామన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు పరిష్కరించడం తన కర్తవ్యమనీ, ప్రజల్లో భాగమైన పాత్రికేయుల సమస్యలు పరిష్కరించలేకపోవడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే పాత్రికేయులైనా, ఎలాంటి రాజకీయ అభిప్రాయాలతో వున్నా వాటన్నిటికీ అతీతంగా తమ సమస్యపై ఉమ్మడిగా కలసి పోరాడాలని సూచించారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ విజయాన్ని వెంకట్రావు ఉటంకించారు.
నాలుగోస్తంభాన్ని నిలబెడదాం!
వ్యవస్థకు జర్నలిజం నాలుగో స్తంభమని చెప్పే ప్రభుత్వాలు పాత్రికేయుల సమస్యలపై మాత్రం సకారాత్మకంగా స్పందించడం లేదని ప్రభుత్వ విప్ యార్లగడ్డ నిర్మొహమాటంగా చెప్పారు. ప్రభుత్వమూ – ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రజాసమస్యల్ని నిరంతరం పాలకుల దృష్టికి తీసుకొచ్చే పాత్రికేయులు నేటికీ కనీస వేతనాలకు నోచుకోకపోవడం, హక్కుల సాధనకు వారే రోడ్డెక్కాల్సి రావడం కూడా బాధాకరమన్నారు. భారీ కుంభకోణాలను వెలికితీసి ప్రజల దృష్టికి తెస్తూ, పాలకుల కళ్ళుతెరిపించే పాత్రికేయులు తమ చిన్నపాటి సమస్యల్ని కూడా పరిష్కరించుకోలేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. 17 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో స్థలం సాధించుకోవడం, గత రెండు ప్రభుత్వాల హయాంలోనూ సొసైటీకి స్థలం స్వాధీనపర్చకపోవడంపై తాను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ 17 ఏళ్ల కాలంలో సొసైటీ సభ్యులైన పదిమందికి పైగా పాత్రికేయ మిత్రులు వివిధ కారణాల వల్ల మృతి చెందడం విషాదకరమన్నారు.
ఇదిలావుండగా, పాత్రికేయుల సహకార సంఘానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించడంపై యార్లగడ్డ వెంకట్రావు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. విజయవాడ రూరల్ మండల తహశీల్దార్ ను స్థలం వద్దకు పిలిపించి, వారం రోజుల్లోగా అక్రమ ఆక్రమణలను తొలగించాలని సూచించారు. సభా కార్యక్రమంలో పాత్రికేయుల గృహ నిర్మాణ సహకార సంఘం అధ్యక్షుడు చిగురుపాటి సతీష్ బాబు, సిఈఓ ఎస్.వెంకట్రావు, ప్రముఖ సహకారవాది దాసరి కేశవులు, సొసైటీ డైరెక్టర్లు యడవల్లి శ్రీనివాసరావు, దుర్గరాజు స్వాతి, జిడిఎల్ శ్రీనివాస్, బత్తుల రాయప్ప, చిన్నం కోటేశ్వరరావు, ఎబిఎన్ ప్రసాద్, అక్బర్ పాషా, పెద్దసంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. (Story : పాత్రికేయుల స్థలం సమస్యకు తక్షణ పరిష్కారం)