వడ్డెర్లు కులవృత్తులకు
న్యాయం చేసింది తెలుగుదేశం మాత్రమే
వినుకొండలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ :
రాష్ట్రంలో వడ్డెర్లు సహా కులవృత్తులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వడ్డెర సామాజిక వర్గం పూజ్యుడు వడ్డె ఓబన్న జీవితం వారి చరిత్రకు, ప్రాధాన్యతకు, పోరాట స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. వినుకొండ నరసరావుపేట రోడ్లులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణలో శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వడ్డె ఓబన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహాన్ని వినుకొండలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉయ్యాల నరసింహారెడ్డి కుటుంబానికి అండగా స్వాతంత్ర్య సమరయోధుడిగా బ్రిటిష్‌వారిపై పోరాటానికి వడ్డెర సంఘంతో పాటు వాల్మీకిలు, చెంచులను సైన్యంగా తయారుచేసి బ్రిటిష్‌వారిపై పోరాడిన వీరుడు ఓబన్న చరిత్ర నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వడ్డెర్లకు వడియ రాజులుగా రాజ్యాల్ని పాలించిన చరిత్ర ఉందన్నారు. కాలక్రమంలో విద్య, సామాజిక, ఆర్థిక వెనకబాటుకి గురైన వారికి తెలుగుదేశం, ఎన్డీఏ ప్రభుత్వంలోనే మళ్లీ మంచి జరుగుతోందన్నారు. బీసీ గురుకులాల సాయంత మేస్త్రీల బిడ్డలు రేపు ఇంజినీర్లు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, ఇళ్ల నిర్మాణం నుంచి బండరాళ్లు పగులగొట్టడం దాకా శ్రమజీవులు వడ్డెర్లని గుర్తుచేశారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా వడ్డెరల్లో బాగా చదువుకునే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తామనీ తెలిపారు. వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలని సీఎం చంద్రబాబు ఆనాడు జీవో 173 విడుదల చేసి సత్యపాల్ నేతృత్వంలో అధ్యయన కమిటీ వేశారని, దాన్ని ముందుకు తీసుకెళ్లాలని వడియరాజుల తరఫున సీఎం చంద్రబాబును కోరతానని తెలిపారు. వినుకొండలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని వడియరాజులు కోరారని, అందుకే రూ.2-3 కోట్లతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించి తీరుతామని చెప్పారు. సీఎం చంద్రబాబు సహకారంతో చక్కటి బీసీ భవన్ నిర్మిస్తామని, దానికోసం మంచి స్థలాన్ని గుర్తించి కేటాయిస్తామని తెలిపారు. వడ్డెర్లతో పాటు బీసీలకు ఎలాంటి ఇబ్బందులు, కష్టమొచ్చినా తాను తోడు ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, విగ్రహ కమిటీ చైర్మన్ పల్లపు వెంకటేశ్వర్లు, కార్యదర్శి బత్తుల నరసింహారావు, మాజీ కౌన్సిలర్ బత్తుల బాలరాజు, కౌన్సిలర్ దేవల్ల ప్రసాద్, బత్తుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. (Story :వడ్డెర్లు కులవృత్తులకు న్యాయం చేసింది తెలుగుదేశం మాత్రమే)