ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఒక్కొక్కరికి 25 లక్షల సేవలు
వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభించిన జీవీ
న్యూస్ తెలుగు/ వినుకొండ :రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఒక్కొక్కరికి రూ.25 లక్షల విలువైన వైద్య సేవలు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా అందులో కవరేజ్ ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంనేయులు అన్నారు. రాష్ట్రంలో ఏటా 70 వేల కొత్త క్యాన్సర్ కేసులు,40 వేల వరకూ మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకం ఎంతో ఉప యుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు అన్నివిధాల సాయంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుని శుక్రవారం చీఫ్ విప్ జివి ఆంజనేయులు ప్రారంభించారు. నోటి, గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షల కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో మాట్లాడిన జీవీ దేశం, రాష్ట్రంలో ఏటా లక్షలమంది క్యాన్సర్‌కు బలవడం బాధాకరం అన్నారు. ఏ క్యాన్సర్ అయినా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయ స్థితి నుండి బయట పడవచ్చని, అందుకే ప్రతి మహిళ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లోనూ ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయాలని ఒమేగా యాజమాన్యం, వైద్యుల్ని కోరారు. త్వరలో రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారని, దాంతోబాటు ఒమేగా లాంటి ఆసుపత్రి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గుంటూరు జీజీహెచ్‌లోనూ క్యాన్సర్ కి నాణ్యమైన వైద్యం, ఔషధాలు అందిస్తున్నారన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వ పరంగానూ ప్రోత్సహించాలని, రైతులు కూడా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు పండించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రకృతి సేద్యం ద్వారా దిగుబడులు తక్కువ వచ్చినా మంచి ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, పి.వి.సురేష్ బాబు, వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు (Story : ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఒక్కొక్కరికి 25 లక్షల సేవలు)