అందరి సహకారంతో నగర అభివృద్ధి
మేయర్ వెంపడాపు విజయలక్ష్మి
న్యూస్‌తెలుగు/విజయనగరం : అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. ఈరోజు ఆమె అధ్యక్షతన విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం జరిగింది. మొత్తం అజెండాలో పొందుపరిచిన 36 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.జీరో అవర్ సమయంలో పలువురు సభ్యులు స్థానిక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పల్లి నల్లనయ్య సభ్యులకు తెలియజేశారు. అనంతరం అజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చ జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించిన తర్వాత ఆమోదం తెలిపారు. నగరపాలక సంస్థకు ఇంధన పొదుపు అంశంలో సిల్వర్ అవార్డు రావడం పట్ల సమావేశంలో పలువురు సభ్యులు కమిషనర్ పల్లి నల్లనయ్య కు అభినందనలు తెలియజేస్తూ ఆయన అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సమావేశ అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. ఇంధన పొదుపు అంశంలో నగరపాలక సంస్థకు సిల్వర్ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. అందరి కృషి ఫలితంగానే అవార్డు లభించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి దోహదపడే అంశాలకు సభ్యులందరూ ఆమోదం తెలపడం సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. (Story : అందరి సహకారంతో నగర అభివృద్ధి)