విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రానున్న బోర్డు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని 10వ, ఇంటర్ విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మర్రికుంట లో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించారు. త్వరలో ఇక్కడ విద్యార్థులకు కోడింగ్ పాఠశాల పేరుతో ఆన్లైన్ ద్వారా పైతాన్ కోడింగ్ క్లాసులు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వసతులపై ఆరా తీశారు. అనంతరం అదనపు కలెక్టర్ పాఠశాలలోని కిచెన్, వంట సామాగ్రి భద్రపరిచే గదులను తనిఖీ చేశారు. వంట సామాగ్రి స్టాక్ కు సంబంధించిన రిజిస్టర్ లను చెక్ చేశారు. స్టాక్ వచ్చినప్పుడు మెస్ కమిటీ విద్యార్థులు సంతకం చేస్తున్నారా అని ప్రశ్నించారు. స్టాక్ వచ్చినప్పుడు విద్యార్థుల సమక్షంలోనే దించుకోవాలని సూచించారు. వంట సామాగ్రి నాణ్యత, ఎక్స్పైరీ డేట్ పని సరిగా చెక్ చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు సూపర్వైజర్లు తిని రుచి చూడాలని, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ సరస్వతి, తదితరులు ఉన్నారు. (Story : విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలి)