కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
తెలుగువారికే గర్వకారణం
పెనుగొండ లక్ష్మీనారాయణకు అభినందనలు తెలిపిన జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రముఖ అభ్యుదయకవి, సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలుగువారికి, పల్నాడు, వినుకొండకు గర్వకారణమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా శ్రామికజన పక్షపాతి, అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాక ప్రస్తుతం అరసం జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు ఇంత కాలానికి సముచిత గౌరవం లభించిందని అన్నారు. లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన సందర్భంగా బుధవారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెం వాసికి ఇలాంటి గుర్తింపు దక్కడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ఈ శుభసందర్భాన లక్ష్మీనారాయణకు మనస్ఫూర్తిగా అభినందనలు అన్న జీవీ, ఆయన కలం నుంచి పేదలు, శ్రామికవర్గాల ఉద్ధరణకు సంబంధించి మరిన్ని అక్షరశరాలు జాలువారాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆయన ఇలాంటి మరెన్నో అత్యున్నత గౌరవాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు. (Story : కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగువారికే గర్వకారణం)