ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే
అమృతధార కురిపిద్దాం
• గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం
• కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ రూ.26 వేల కోట్లకే ప్రతిపాదనలు పంపింది
• గత పాలకుల తప్పిదాలతో పథకం అస్తవ్యస్తం
• పైపులు, బోర్లు వేసి పథకం ఆలోచనకు తూట్లు పొడిచారు
• ఇటీవల కేంద్ర మంత్రివర్యులను రూ.70 వేల కోట్లు కావాలని కోరాం
• సమగ్ర డీపీఆర్ తయారీ చేసి అందిస్తే పథకం గడువు పెంచేందుకు కేంద్రం సుమఖం
• జిల్లా యూనిట్ గా శాశ్వతంగా మంచినీటి వెతలు తీర్చేలా ప్రణాళిక తయారు చేయండి
• మానవతా దృక్పథంతో ప్రజల కోసం సమష్టిగా పనిచేద్దాం
• ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్
న్యూస్‌తెలుగు/విజయవాడ : జల్ జీవన్ మిషన్ పనుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని,ఇప్పుడున్న నీటి వనరులకు కొత్తరూపు తీసుకురావడంతో పాటు కొత్త నీటి వనరులను సృష్టించుకోవడం అవసరమని, నీటి నిర్వహణ, సరఫరా విషయంలోనూ పటిష్టమైన ప్రణాళిక ఉండాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ సూచించారు. జల్ జీవన్ మిషన్ అమలు పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను లెమన్ ట్రీ హోటల్ లో బుధవారం ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కె. పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే బృహత్తర ప్రణాళికతో అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జల్ జీవన్ మిషన్ పనులకు ఎలా మొదలుపెట్టాలి… ఎలా ముందుకు తీసుకెళ్లాలి… పటిష్టంగా ఎలా పూర్తి చేయాలనే విషయాలను అధికార యంత్రాంగం సమన్వయం చేసుకొని పనిచేయాలని, కేవలం పనులు చేసి వదిలేయడం కాకుండా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు (గ్రీవెన్స్) కోసం కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి ముందుకు వెళ్లాలి. జల్ జీవన్ పనులన్నీ ప్రజలకు ఫలాలు అందించాల్సిన తరుణంలో వారి సూచనలకు పెద్దపీట వేయాలి. జన వనరుల లభ్యత, వాటి నుంచి పొందాల్సిన ప్రయోజనం, ఇతర అంశాలను నిశీతంగా పరిశీలించి శాశ్వతంగా ఫలితాలు అందేలా జల్ జీవన్ మిషన్ పనులను మొదలుపెట్టాలన్నారు.
ఇప్పటికీ తాగు నీటి కోసం బతుకువెతలు తప్పడం లేదు
స్వాతంత్య్రానంతరం భారతదేశం ప్రజలకు తాగు నీటిని అందించేందుకు లక్షల కోట్లను ఖర్చు చేసిందన్నారు.. ప్రతి మనిషికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత, ప్రతి మనిషి సగటున 55 లీటర్ల మంచినీరు అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు మొదలైందన్నారు.. 2008లో ఆదిలాబాద్ తండాల్లో తిరుగుతున్నపుడు చూపులేని ఓ వృద్ధురాలు కాస్త నీళ్లిప్పించయ్యా.. అన్న మాట నాకెప్పుడూ తల్చుకున్నా కళ్లలో గిర్రున నీళ్లు తిరిగేలా చేస్తాయన్నారు.
నా శాఖల్లో అత్యంత కీలకమైంది.. నాకు ఇష్టమైంది గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అందించే కీలక బాధ్యత, స్వచ్ఛమైన తాగునీరు అందితే ప్రజల సంతోషం అంతాఇంతా కాదని, వారికి స్వచ్ఛమైన నీరు అందితే చాలావరకు ఇతర సమస్యలు తొలగిపోతాయన్నారు. ప్రజలంతా ఆనందంగా ఉండటానికి మంచినీరు అందడం అనేది ప్రదానమన్నారు.
• కేరళ కంటే తక్కవగా ప్రతిపాదనలు
నేను వ్యక్తిగతంగా చాలాసార్లు జల్ జీవన్ మిషన్ పనుల గురించి సమీక్ష చేశాను, ఇంతటి కీలకమైన పథకం, ప్రజలందరికీ మేలు చేసే ఈ పథకం తీరుతెన్నులను, జరిగిన పనులను తెలుసుకున్నానన్నారు. కానీ అనుకున్నంత విజయవంతంగా పనులు జరిగలేదన్నారు. 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రారంభించే ముందు ప్రతి రాష్ట్రం తాగు నీటి అవసరాలకు సంబంధించి, ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించేందుకు ఎంత మేర నిధులు అవసరం అవుతాయని కేంద్రం రాష్ట్రాలను అడిగినపుడు ఉత్తర ప్రదేశ్ రూ. 1.50 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్ రూ. 83 వేల కోట్లు, గుజరాత్ రూ. 32 వేల కోట్లు, కేరళ రూ. 45 వేల కోట్లు అడిగిందన్నారు. కేరళ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్న రాష్ట్రం, అయినప్పటికీ వారు భవిష్యత్తు అవసరాలు, ప్రజలకు అందించాల్సిన పూర్తి తాగు నీటి పనులు కావాలంటే నిధులు ఎక్కువ అవసరం అనే కోణం ఆలోచించి అంత మొత్తం అడిగారన్నారు. గత ప్రభుత్వ పాలకులు మాత్రం ఆంధ్రప్రదేశ్ కు కేవలం రూ. 26 వేల కోట్లు చాలు అన్నట్లుగా ప్రతిపాదనలు పంపారన్నారు. దీంతో కేంద్రం మొదటి దశలో రూ. 4,787 కోట్ల పనులు మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కచ్చితంగా రాష్ట్ర వాటాగా మ్యాచింగ్ గ్రాంటు కేటాయించాలనే నిబంధన ఉంటుందన్నారు. జల్ జీవన్ మిషన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన మ్యాచింగ్ గ్రాంటు కూడా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయామన్నారు.
• పథకం ఆశయాలకు తూట్లు పొడిచి బోర్ వెల్స్ కు అనుసంధానం
జల్ జీవన్ మిషన్ పనుల్లో శాశ్వత నీటి వనరుల మీద దృష్టి సారించడం అనేది కీలకం. నేను ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ తో సమవేశమైనప్పుడు కూడా గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకంలో సమీపంలోని రిజర్వాయర్లు, ఇతర అతి పెద్ద నీటి వనరుల నుంచి నీటిని గ్రామాలకు ఇవ్వాల్సింది పోయి భూగర్భ జలలాను బోర్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేసిందన్నారు. భూగర్భ జలాలను పెపొందించేందుకు ఈ పథకం అధిక ప్రాధాన్యం ఇస్తే, గత ప్రభుత్వం మాత్రం రిజర్వాయర్లు, నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా కేవలం బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. రాష్ట్రంలో 38 మేజర్ రిజర్వాయార్ల ద్వారా 95.44 లక్షల తాగునీటి కుళాయిలకు అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. అయితే గత ప్రభుత్వ పాలకులు మాత్రం కేంద్ర జల్ జీవన్ మిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి బోర్ల ద్వారా నీటిని అందించేందుకు ఇష్టానుసారం పనులు చేశారన్నారు. నీటిని ఎక్కడ నుంచి.. ఎలా తీసుకురావాలి..? ఏ పద్ధతిలో నీటిని అందించాలనే కనీస అవగాహన లేకుండా, ముందుగా గ్రామాల్లో పైపులైన్లు వేసేశారన్నారు.
• కేంద్ర పెద్దలకు రూ.70 వేల కోట్ల అవసరం అని చెప్పాం
కొత్త ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సూచనల ప్రకారం జల్ జీవన్ మిషన్ పథకంలో రిజర్వాయర్లు, నీటి వనరుల నుంచి నీటిని ఎంత బలంగా గ్రామాలకు అందించాలనే విషయంలో కసరత్తు చేశామని, ఇటీవల కేంద్ర మంత్రి శ్రీ సీఆర్. పాటిల్ ని కలిసినప్పుడు కూడా రాష్ట్ర తాగు నీటి అవసరాలకు మేరకు, జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాల మేరకు కనీసం రూ. 70 వేల కోట్లు అవసరం అవుతాయని, రాష్ట్రానికి కేటాయించిన నిధులను పెంచాలని కోరానన్నారు. దీనికి కేంద్ర మంత్రివర్యులు మీకు రూ. 70 వేల కోట్ల అవసరాలకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించాలని కోరారన్నారు. దీనిపై ఇప్పుడు దృష్టి సారించాం, రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందించేందుకు అవసరమైన పనులకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును జనవరి, 2025 లోగా రూపొందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, దీన్ని కేంద్ర మంత్రివర్యులకు పంపుతామన్నారు.
• సర్వే ద్వారా అసలు లెక్కలు బయటకు….
నేను ఏ జిల్లాకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినా ప్రజలంతా మాకు తాగునీరు లేదని చెబుతున్నారన్నారు. దీంతో అధికార యంత్రాంగాన్ని నేను గత ప్రభుత్వం అసలు జల్ జీవన్ మిషన్ పనుల్లో ఏం పనులు చేసిందన్నారు. ఎంత మందికి తాగునీటి అందించింది, ఎన్ని కుళాయి కనెక్షన్లు ఇచ్చారు, వాటి పరిస్థితి ఏంటీ అనే దానిపై పల్స్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పామన్నారు. గత ప్రభుత్వ పాలకులు చెప్పిన లెక్కల్లో 70.04 లక్షల కుటుంబాలకు నీటి కుళాయిలు ఇచ్చేశామన్నారు. ఇంకా 25.40 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 4 వారాల పాటు నిర్వహించిన పల్స్ సర్వే నిర్వహించిన తర్వాత 85.22 లక్షల కుటుంబాలకు గాను, 55.37 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు, 29.85 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ఇవ్వాల్సి ఉందని తేలిందన్నారు.
• అమృతధారలో పక్కా ప్రణాళికతో డీపీఆర్ తయారు చేద్దాం
ఇప్పుడు ఈ అమృతధార వర్క్ షాపు లో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల అధికారులకు చెప్పేదేమంటే జల్ జీవన్ మిషన్ పనుల పూర్తి కోసం కేంద్రం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. దీన్ని ఉపయోగించుకొని మనమంతా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చే బాధ్యతను తీసుకోవాలి. శాశ్వతంగా వారి సమస్యను తీర్చేలా, గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా మానవాత దృక్పథంలో కలిసి పనిచేద్దాం. జల్ జీవన్ మిషన్ లో కేవలం పైపులైన్లు వేసి హడావుడి చేయకుండా, ప్రతి గ్రామీణుడికి రోజుకు సగటున 55 లీటర్ల తాగునీరు అందించే బృహత్తర బాధ్యతను తీసుకుందన్నారు.. కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడా దుర్వినియోగం కాకుండా పథక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. దీనికి అందరి సహకారం కావాలి. కేవలం పైపులైన్లు వేసి చేతులు దులుపుకోకుండా, అన్ని సాంకేతిక అంశాలు పరిశీలించి చివరి ప్రాంతాలకు సైతం తాగునీరు అందేలా చూడాలి. జల్ జీవన్ నిధుల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో డీపీఆర్ తయారు చేయండి. సమగ్రంగా, సంవృద్ధిగా గ్రామీణ ప్రజలకు తాగునీరు అందించే బాధ్యతను తీసుకుందాం.
• పథకం ఫలాలు అందరికీ అందాలి
జల్ జీవన్ మిషన్ నిధులు ఇన్నివేల కోట్లు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం నాకు చాలాచోట్ల దారుణమైన పరిస్థితులే కనిపించాయి. గత ప్రభుత్వం కనీసం ఫిల్డర్ బెడ్స్ కూడా చాలా చోట్ల మార్చలేదు. రూ.5 లక్షలు వెచ్చిస్తే ఫిల్డర్ బెడ్లకు ఇసుకను మార్చవచ్చు. అది కూడా చేయలేదు. వాటర్ షెడ్ పథకం ఉపయోగించుకొని, నీటి నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించి ఈ గొప్ప ప్రయత్నంలో అంతా భాగస్వామ్యం అవుదాం. నేను డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడి మిమ్మల్ని ఆదేశించడం లేదు. ఈ గొప్ప కలను తీర్చేందుకు అంతా సమష్టిగా పనిచేయాలని అభ్యర్థిస్తున్నాను. కోటి కుటుంబాల సు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సురక్షిత మంచినీటిని అందించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్లే కార్యక్రమంలో మనసు పెట్టి పనిచేద్దామన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి విభాగం ముఖ్యకార్యదర్శి శ్రీ శశిభూషణ్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పరిశుభ్రమైన తాగు నీరు అందించడమేనన్నారు. దీనిపై లోపాలను సరిదిద్ది పథకాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రోజు వర్క్ షాపు ఏర్పాటు చేశామన్నారు.
కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగం చీఫ్ ఇంజినీర్ శ్రీ సంజీవరెడ్డి, హరిరామ నాయక్, జలవనరుల చీఫ్ ఇంజినీరు శ్రీ వెంకటేశ్వర్లు అన్ని జిల్లాల నుంచి ఈఈ లు, ఎస్ఈ లు పాల్గొన్నారు. (Story : ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం)