Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేట్ కు ధీటుగా ‘బీసీ’ సివిల్ సర్వీసెస్ కోచింగ్

కార్పొరేట్ కు ధీటుగా ‘బీసీ’ సివిల్ సర్వీసెస్ కోచింగ్

0

కార్పొరేట్ కు ధీటుగా ‘బీసీ’ సివిల్ సర్వీసెస్ కోచింగ్

• బీసీ స్టడీ సర్కిల్‌తో పాటు ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రం ప్రారంభించిన మంత్రి..
• తొలి విడతగా 110 మందికి శిక్షణ..
• ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పన..
• త్వరలో అమరావతిలో శాశ్వత బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం..
• 5 ఎకరాల్లో 500ల మందికి శిక్షణ ఇచ్చేలా భవన నిర్మాణం 
• రాష్ట్ర బీసీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్, చేనేత & జౌళి శాఖామాత్యులు ఎస్. సవిత

న్యూస్‌తెలుగు/విజయవాడ, డిసెంబర్ 18 : కార్పొరేట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా బీసీ యువతకు సివిల్ సర్వీసెస్ శిక్షణ ఇవ్వనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బుధవారం విజయవాడ, గొల్లపూడిలో తాత్కాలిక బీసీ స్టడీ సర్కిల్ భవనంతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ను ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాస్‌తో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి ప్రసంగించారు. దివంగత ఎన్టీఆర్ బీసీల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగించారని, అందుకే బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారన్నారు. పాలనలో తమలాంటి వారికి ప్రాధాన్యమిస్తూ, పదవులు కట్టబెట్టారన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పంచాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీల కోసం రూ.39 వేల కోట్లకుపైగా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నామన్నారు. దీనిలో భాగంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అత్యధిక టీచర్ పోస్టులను బీసీ యువత సాధించాలనే లక్ష్యంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

అమరావతిలో శాశ్వత బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు

యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లోనూ బీసీ యువత ఉత్తీర్ణత సాధించి, అత్యధిక మంది వెనుకబడిన తరగతి వారు ఐఏఎస్ లు కావాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్షని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగానే బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. 600 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హత పరీక్ష నిర్వహించగా 110 మంది సివిల్ సర్వీసెస్ కోచింగ్ కు ఎంపికైనట్లు మంత్రి తెలిపారు. బీసీ-ఏ -17, బీసీ-బీ-24, బీసీ-సీ -2, బీసీ-డీ-18, బీసీ-ఈ-05, ఎస్సీ-20, ఎస్టీ-14, ఈడబ్ల్యూఎస్ కింద 10 మందిని ఎంపిక చేశారన్నారు. వారందరికీ రెసిడెన్షియల్ పద్ధతిలో భోజన, ఇతర వసతి సదుపాయాలు అందించనున్నామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో శిక్షణా తరగతులు ప్రారంభించామన్నారు. వచ్చే శిక్షణ నాటికి రాజధాని అమరావతి ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించనున్నట్లు తెలిపారు. 500ల మంది అభ్యర్థులకు శిక్షణిచ్చేలా ఈ భవన నిర్మాణం చేపట్టనున్నామని, రెండేళ్లలో ఈ భవనం అందుబాటులోకి తేనున్నామన్నారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధంచేశామని, సీఎం చంద్రబాబునాయుడు నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతామని మంత్రి సవిత వెల్లడించారు.

సీనియర్ ఐఏఎస్ లతో ప్రత్యేక క్లాసులు

దేశంలోనే ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లా ఎక్స్ లెన్స్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిష్ణాతులపైన అధ్యాపకులతో బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ కోచింగ్ సెంటర్ లో తరగతి గదితో పాటు డిజిటిల్ లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్, డిస్కషన్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో పాటు మెటిరీయల్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. తనవంతుగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెటీరియల్ అందివ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సివిల్ సర్వీసెస్ శిక్షణివ్వడంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారని, ఆయన కూడా వారినికో క్లాసులు ఇవ్వనున్నారని తెలిపారు. పలువురు సీనియర్ ఐఏఎస్ లతోనూ శిక్షణలో అభ్యర్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నామన్నారు. బీసీ యువత లక్ష్య సాధనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ శిక్షణ సద్వినియోగం చేసుకుని, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులందరూ ఐఎఎస్ లు‌గా విజయం సాధించాలని మంత్రి సవిత ఆకాంక్షించారు.

నవ్యాంధ్ర నిర్మాతలు మీరే…

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, నవ్యాంధ్ర నిర్మాతలు కావాలని ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, కొలికపూడి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. సానుకూల దృక్పథంతో ఉంటే విజయం సులభంగా సాధించ వచ్చునని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. నగరాల్లో వచ్చే వారికంటే పల్లెల్లో ఉండే యువత ఐఏఎస్ లు, ఐపీఎస్ లు‌గా ఎంపికైతే ఆ ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందన్నారు. మరింతమందికి స్ఫూర్తిగా ఉంటారన్నారు. మెయిన్స్ ప్రిపేర్ అయితేనే సులభంగా ప్రిలిమ్స్ లో విజయం సాధిస్తారని ఎమ్మెల్మే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. గడిచిన ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. 5 ఏళ్ల పాటు ఉద్యోగాల భర్తీ లేక రాష్ట్రంలో యువత తీవ్ర ఇబ్బందుల పాలయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్‌లో ప్రతివారం ఇండియన్ ఎకానమీపై తాను ప్రత్యేక క్లాసు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్మే కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. లా ఎక్స్ లెన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డీవీ రావు మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన వసతులు కల్పించిందన్నారు. ఈ అవకాశాలు వినియోగించుకుని అభ్యర్థులు సత్ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కోచింగ్ కు ఎంపికైన కర్నూలు యువకుడు నవీన్ కుమార్, అనకాపల్లికి చెందిన ధనలక్ష్మి మాట్లాడుతూ, ఎంతో ఖరీదైన సివిల్ సర్వీసెస్ కోచింగ్ ను పేద కుటుంబాలకు చెందిన తమకు ఉచితంగా అందజేస్తున్న సీఎం చంద్రబాబుకు, మంత్రులు నారా లోకేశ్ కు, సవితకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వమందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వెల్లడించారు. అంతకుముందు బీసీ స్టడీ సర్కిల్ భవనంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్, డిస్కషన్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్ లను ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, దేవేంద్రప్ప, రుద్రకోట సదాశివం, చిలకలపూడి పాపారావు, నందం అబద్ధయ్య, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, డైరెక్టర్ మల్లికార్జున, బీసీ సంఘ నాయకులు కేశన శంకరరావు, సివిల్ సర్వీసెస్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. (Story : కార్పొరేట్ కు ధీటుగా ‘బీసీ’ సివిల్ సర్వీసెస్ కోచింగ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version