గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
న్యూస్ తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : జిల్లాలో ఈనెల 17, 18 తేదీలలో జరగనున్న గ్రూప్ 3 పరీక్షలను పకడిబందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్. పి. డి.వి.శ్రీనివాస రావు, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, కాగజ్ నగర్ అదనపు ఎస్.పి. ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వరరావు, పరీక్షల రీజనల్ కో-ఆర్డినేటర్ లక్ష్మీనరసింహ లతో కలిసి చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖ అధికారులు, పరిశీలకులు, రూట్ అధికారులు, ఐడెంటిఫికేషన్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 3 పరీక్ష కొరకు జిల్లాలోని ఆసిఫాబాద్ లో 9 కేంద్రాలు, కాగజ్ నగర్ లో 9 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పరీక్ష కేంద్రంలో త్రాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచుతూ వెలుతురు, ఫర్నిచర్, ఫ్యాన్లు ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ సెంటర్లను మోసం జరుగుతుందని తెలిపారు. 17 వ తేదీన 2 సెషన్లు, 18న ఒక సెషన్ ఉంటాయని, పరీక్ష కేంద్రాలలో ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ లకు అనుమతి ఉండదని, అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఆర్. టి. సి. అధికారులు సమయానుసారంగా బస్సులు నడిపించాలని, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అభ్యర్థులను మొదటి పేపర్ కు ఈ నెల 17వ తేదీన ఉదయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగుతుందని, 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, రెండవ పేపర్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం పరీక్షకు 9.30 గంటలకు గేటు మూసివేయడం జరుగుతుందని, పరీక్ష సాగుతున్న సమయంలో ప్రతి అరగంటకు ఒకసారి షార్ట్ బెల్, పరీక్ష ముగిసే 5 నిమిషాల ముందు షార్ట్ బెల్, పరీక్ష ముగిసే సమయానికి లాంగ్ బెల్ మోగిస్తారని తెలిపారు. 18వ తేదీన ఒక పేపర్ ఉంటుందని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, ఈ పేపర్ కు మొదటి రోజు ఉదయం పేపర్ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. 9.30 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రంలోనికి అనుమతి ఉండదని, అభ్యర్థులు ఈ సమయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఎలెక్ట్రానిక్ పరికరాలు, చేతి గడియారాలు, మొబైల్ లు తీసుకురాకూడదని తెలిపారు.ఎస్. పి. మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ రీజియన్ కో-ఆర్డినేటర్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story:గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి)