నేరాలను ప్రోత్సహించిన జగన్‌రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి
విజయవాడ వరద బాధితుల సహాయార్థం
శివశక్తి అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ రూ.50 లక్షల విరాళం
సచివాలయంలో సీఎం చంద్రబాబుకు చెక్కు అందించిన
ఎమ్మెల్యే జీవీ దంపతులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో భారీ కుట్రలు, నేరాల కుట్రలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న మాజీముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. కడుపుమండిన వాళ్లే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారంటూ నిందితులను వెనకేసుకుని వస్తోన్న జగనే ఆ కేసు లో అసలు సూత్రధారి అని స్పష్టం చేశారాయన. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇంత బాధ్య తారాహిత్యంగా, ఇంత క్రిమినల్ మైండ్‌తో ఉంటాడని ఎవరూ ఊహించరన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గురువారం భారీ విరాళం అందించారు. శివశక్తి అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. తన సతీమణి, శివశక్తి ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ లీలావతి, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఎన్.ఎస్.రావు, మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి చంద్రబాబుకు చెక్కును అందించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళం ఇచ్చిన జీవీ ఆంజనేయులు దంపతులను, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ నందిగం శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు అభినందించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ముఖ్యమంత్రి సహాయ నిధికి శివశక్తి అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఛైర్మన్ నందిగం శ్రీనివాసరావుతో కలసి రూ.50 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారన్నారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.రావుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను తిరిగి సాధారణ స్థితికి చేర్చేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఇదే సందర్భంగా అధికారం పోయిన దగ్గర్నుంచి ప్రజలపై కక్ష కట్టిన మాజీ సీఎం జగన్ రెడ్డి కొంతకాలంగా నేరాలను, ఘోరాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు బోసిడీకే అన్నందుకే తమవారు దాడి చేశారని జగన్ అంటున్నారని, సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి నేరాలను ప్రోత్సహిస్తారా? అని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈ విధమైన నందిగం సురేష్ లాంటి వ్యక్తులను, దాడులను ప్రోత్సహించడం చాలా దుర్మార్గమని ధ్వజమెత్తారు. బోసిడీకే అన్నందుకే మా వాళ్లు దాడి చేశారని నేరాన్ని జగన్‌రెడ్డే ఒప్పుకుంటున్నారని అన్నారు. నేరాలను ప్రోత్సహించిన జగన్‌రెడ్డిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌రెడ్డి చేసిన అరాచకాలకు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకు, రాజ్యాంగ విలువలను నట్టేట ముంచేసినందుకు జగన్‌రెడ్డిని సంఘ విద్రోహ శక్తిగా, లక్షల కోట్ల అవినీతితో రాష్ట్రాన్ని దోచుకున్నందుకు సంఘ విద్రోహ శక్తిగా సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మద్యంలో గానీ గనుల్లో గానీ ఇసుకలో గానీ దోచుకున్న లక్షల కోట్లను ప్రజలకు చెందేలా చేస్తే ఇలాంటి వారికి సరైన గుణపాఠం నేర్పినట్లు అవుతుందన్నారు జీవీ. అసలు బుడమేరు వాగు పొంగి విజయవాడ మునిగిందంటే కారణం నరరూప రాక్షసుడు జగన్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి పాలనలో యధేచ్ఛగా కాల్వలు, వాగుల కట్టలను చిన్నాభిన్నం చేశారని, కట్టలపై మట్టిని అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు వాగు కట్ట తెగడానికి జగన్‌రెడ్డి పాలనే కారణమని పేర్కొన్నారు. దీనికి జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ పాపం జగన్‌రెడ్డిది కాదా అని ప్రశ్నించారు. మాట్లాడే హక్కు జగన్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. (Story : నేరాలను ప్రోత్సహించిన జగన్‌రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి)